– ఆధారాలు ఉన్నా పట్టించుకోని అధికారులు
– ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలి
– ఫిర్యాదులేఖలో సామాజిక కార్యకర్త
– ఆధారాలతో సహా ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు అందజేత
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
రెండేండ్లుగా ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నల్లగొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందినిపై నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త, ప్రజా దర్బార్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదుపై త్వరలో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌సెల్ నుంచి ఆదివారం సామాజిక కార్యకర్తకు రిప్లై వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ‘నవతెలంగాణ’తో మాట్లాడుతూ.. డీఆర్‌డీఓ పీడీ కాళిందిని విధుల నిర్వహణలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలకు సంబంధించిన కథనాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయని, ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్, జిల్లా కలెక్టర్, ఏసీబీ, సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా డిప్యూటేషన్ పేరుతో జిల్లాకు వచ్చిన పీడీ కాళిందిని డీఆర్‌డీఓలో తిష్ట వేసి ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బైరుసన్ సంస్థతో వ్యాపారాలను ఎస్‌హెచ్‌జీ,వీవో, ఎంఎస్ సభ్యులతో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పి మహిళా సంఘాలను మోసం చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా అక్రమ డిప్యూటేషన్లు, సిబ్బందిపై వేధింపులు, ధాన్యం కొనుగోళ్లలో అవినీతి తదితర అంశాలపై ఫిర్యాదు చేస్తూ గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. జిల్లా మహిళా సమైక్యకు సంబంధించి రూ.14,72,576 తన సొంత ఖాతాలోకి మళ్ళించారని చెప్పారు. విషయంపై సేర్ప్ డైరెక్టర్ స్థాయి అధికారి విచారణ చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా విషయంపై రాష్ట్రస్థాయి ఉన్నత అధికారిని నియమించి విచారణ చేయించాలని, తగిన ఆధారాలు ఉన్నందున వెంటనే పీడీని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫిర్యాదు లేఖలో కోరినట్టు తెలిపారు.