ఇది చట్ట విరుద్ధం

– 1968 ఒప్పందాన్ని కూడా ఉలంఘిస్తోంది
– అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై ముస్లిం పర్సనల్‌లా బోర్డ్‌
లక్నో: మధురలోని షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు 1968లో హిందూ ముస్లింలు కుదుర్చుకున్న ఒప్పందానికి, 1991లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి విరుద్ధంగా ఉన్నదని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఎఐఎంపీఎల్‌బీ) అభిప్రాయపడింది. సర్వే చేపట్టడం వల్ల చారిత్రక మసీదు సమస్యకు పరిష్కారం లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తూనే అలా జరగని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. సర్వేతో ఈ సమస్యకు న్యాయ సమ్మతమైన పరిష్కారం లభిస్తుందని ఎఐఎంపీఎల్‌బీ ప్రతినిధి ఖాసిం రసూల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేకు తమ లీగల్‌ కమిటీ సహకరిస్తుందని చెప్పారు. బాబ్రీ మసీదు వివాదం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1991లో ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దాని ప్రకారం దేశం స్వాతంత్య్రం సాధించే నాటికి ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో వాటిని అలాగే కొనసాగించాల్సి ఉంటుంది. అంటే యథాతథ స్థితిని కొనసాగించాలి. ‘ఈ చట్టం కారణంగా కొత్త వివాదాలు తలెత్తబోవని అందరూ ఆశించారు. అయితే దేశంలో శాంతిని, సామరస్యాన్ని ఇష్టపడని శక్తులకు, హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనాన్ని సాధించాలని కోరుకునే వారికి అలా జరగడం ఇష్టం లేదు’ అని రసూల్‌ అన్నారు. స్థానిక హిందూ ముస్లింలు ఒప్పందం కుదుర్చుకొని చట్టానికి అనుగుణంగా 13.37 ఎకరాల భూమిని మసీదు, దేవాలయం మధ్య విభజించారని రసూల్‌ వివరించారు. అయితే ఈ ఒప్పందానికి అలహాబాద్‌ హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉన్నదని చెప్పారు. షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్‌, శ్రీకృష్ణ జన్మస్థాన్‌ సేవా సంస్థాన్‌ మధ్య 1968లో ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం 10.9 ఎకరాలు కృష్ణ జన్మభూమికి, 2.5 ఎకరాలు మసీదుకు వచ్చాయని తెలిపారు. అది ముస్లింల ప్రార్థనా స్థలమని 17వ శతాబ్దపు చరిత్ర చెబుతోందని అన్నారు. సర్వే చేసే స్థలంలో తవ్వకాలు చేపట్టరాదని కోర్టు స్పష్టం చేసిందని, దీనిపై మరింత ఊరట పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నదని చెప్పారు.
వివాదం ఏమిటి?
మొత్తం 13.37 ఎకరాల భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులపై వివాదం నడుస్తోంది. 11 ఎకరాలలో మసీదు, మిగిలిన 2.37 ఎకరాలలో మసీదు నిర్మించారు. అయితే మసీదు నిర్మించిన స్థలాన్ని కూడా తమకే అప్పగించాలని హిందూ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. అదంతా శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం స్థలమేనని వాదిస్తున్నాయి. ఈ వాదనతో ముస్లిం సంస్థలు విభేదిస్తున్నాయి. ఈ వివాదం ఈనాటికి కాదని, 350 సంవత్సరాల నుండి కొనసాగుతోందని చరిత్రకారులు చెబుతున్నారు. 1670లో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు ఢిల్లీని పరిపాలించేటప్పుడు ఠాకూర్‌ కేశవ్‌దేవ్‌ ఆలయాన్ని కూల్చి, అక్కడ మసీదు నిర్మించారు. దేవాలయ శిథిలాలను మసీదు నిర్మాణంలో వాడారు. ఈ కారణంతోనే మసీదును సనాతన ధర్మానికి చిహ్నంగా చెబుతారు. హైకోర్టులో విచారణ సందర్భంగా షాహీ ఈద్గా మసీదు కమిటీ, యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ అసలు మసీదు 13.37 ఎకరాలలోనిది కాదని తెలిపారు. కృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించలేదని చెప్పారు.కాగా మసీదు ప్రదేశంలో సర్వేను పర్యవేక్షించేందుకు అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించడానికి అలహాబాద్‌ హైకోర్ట్‌ అంగీకరించింది. ఈ నెల 18న జరిగే తదుపరి విచారణలో సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రకటిస్తామని హైకోర్ట్‌ న్యాయమూర్తి మయాంక్‌ కుమార్‌ తెలిపారు. వారణాసిలోని జ్ఞానవాపి దేవాలయంలో చేపట్టిన విధంగానే మధుర మసీదులో
కూడా సర్వే జరుపుతారు.