ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం

– సూరత్‌లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం
సూరత్‌: ‘సూరత్‌ డైమండ్‌ బోర్స్‌’ భవన సముదాయాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మించారు. 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా చెబుతున్నారు. సూరత్‌ కేంద్రంగా ఉన్న వజ్రాల పరిశ్రమ ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎస్‌డీబీతో మరో 1.5 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ భవన సముదాయం నవీన భారత శక్తి, సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు.
ఎస్‌డీబీ ప్రత్యేకలివే..
వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి ఎస్‌డీబీ కేంద్రంగా నిలవనుంది. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ భవనాలను గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి సమీపంలోని ఖాజోడ్‌ గ్రామంలో నిర్మించారు. శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఇది అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్‌ క్లియరెన్స్‌ హౌస్‌ కూడా ఇందులోనే ఉంటుంది. ఆభరణాల రిటైల్‌ వ్యాపారులు తమ విక్రయ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకో వచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్‌, సురక్షిత లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది.