ఏఐసీసీ గుణపాఠం నేర్చుకోవాలి

 

– ఇండియా’ కూటమి పార్టీలను కలుపుకుపోవాలి
– ఢిల్లీలో ఐక్యత…రాష్ట్రాల్లో మాదారి మాదే అంటే బీజేపీకే లాభం
– రాజస్థాన్‌లో సీపీఐ(ఎం), ఛత్తీస్‌గఢ్‌లో సీపీఐని కలుపుకుని పోతే కాంగ్రెస్సే గెలిచేది : సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో విజయం సాధించి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఓడిపోవడం కాంగ్రెస్‌ స్వయం కృపరాధమేననీ, దీన్ని ఏఐసీసీ గుణపాఠంగా తీసుకుని ముందుకెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు. ఓవైపు ఢిల్లీలో ఐక్యతంటూనే మరోవైపు రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని 26 పార్టీలను కలుపుకుని పోకపోవడం వల్ల బీజేపీకే లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్‌ని హెచ్చరించారు. తెలంగాణలో సీపీఐని, మేధావులు, అభ్యుదయవాదులను కలుపుకుని ముందుకెళ్లడం వల్లనే కాంగ్రెస్‌ విజయం సాధించిందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో సీపీఐకి ఒక సీటు, రాజస్థాన్‌లో సీపీఐ(ఎం)కున్న రెండు సిట్టింగ్‌ స్థానాలిస్తే ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ తిరిగి అధికారాన్ని దక్కించుకునేదన్నారు. అధికారదర్పం, అహంభావంతో ముందుకెళ్లి కాంగ్రెస్‌ బొక్కబోర్లా పడిందని విమర్శించారు. ఈ అంశాన్ని ఇండియా కూటమిలోనూ చర్చకు పెట్టాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. కుట్రపూరితంగానే ఈసీ సీపీఐకి జాతీయ పార్టీ హోదాను తొలగించిందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో కొంట నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థికి పార్టీ గుర్తు ఇవ్వలేదనీ, చివరకు అభ్యర్థి అడిగిన కుండ గుర్తు కూడా ఇవ్వలేదని చెప్పారు. అక్కడ గిరిజన ప్రజలకు తెలియని ఏసీ గుర్తు కేటాయించడం వల్ల తమ అభ్యర్థి కేవలం 3 వేల ఓట్లతో ఓడియారన్నారు. సాంకేతిక కారణాలతో జాతీయ పార్టీ హోదా తొలగించడం సరిగాదన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మినహా దేశంలో ఎక్కడా లేదని, అయినా ఆ పార్టీకి జాతీయ గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తున్నా, లేకపోయినా వామపక్ష, డీఏంకే, ఎస్పీ పార్టీలతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో నాలుగు, పశ్చిమబెంగాల్‌లో మూడు, తమిళనాడులో రెండు, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, యూపీ, తెలంగాణలో ఒకటి చొప్పున స్థానాల్లో పోటీచేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారుల బాధ్యతల నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌లను తప్పించినట్టుగానే ఇతర రిటైర్డ్‌ ఉద్యోగులను కూడా తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. పర్యాటక శాఖ కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగా ఫైల్స్‌ను తగులబెట్టారనీ, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌కే రక్షణ కల్పించలేని కేంద్ర హోంశాఖ మంత్రి దేశానికి ఎలా రక్షణ కల్పించగలుగుతారని ప్రశ్నించారు. ఆ ఘటనకు హోంమంత్రి బాధ్యత వహించాలన్నారు. దాడికి పాల్పడిన వారికి బీజేపీ ఎంపీనే పాసులిచ్చారనీ, ఆ పార్టీ సహకారం లేనిదే నాలుగంచెల వ్యవస్థను దాటుకుని పార్లమెంట్‌ లోపలికి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు. నిందితులకు పొరపాటున ఎవరైనా ముస్లిం ఎంపీ పాసు ఇప్పించి ఉంటే దేశంలో బీజేపీ వాళ్లు రచ్చరచ్చ చేసేవారన్నారు. ఏపీలో జగన్‌ తన ఒంటెత్తు పోకడలతో తన ఓటమిని తానే కొని తెచ్చుకుంటున్నాడని విమర్శించారు. ఆయన కేసీఆర్‌ కంటే ఎక్కువ తప్పులు చేసుకుంటూ పోతున్నారన్నారు. ఏపీలో బీజేపీతో పోరాడుతున్నట్టు నటిస్తున్న జగన్‌..ఢిల్లీలో మాత్రం ప్రతి అంశంపైనా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ.. శాసనసభ, లోక్‌ఎన్నికల ఫలితాలు ఒకే తరహాలో ఉండబోవన్నారు. బీజేపీ మూడు రాష్ట్రాల్లోనూ అతి తక్కువ ఓట్ల శాతం తేడాతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..భూ సమస్య పరిష్కారానికి రెవెన్యూ నిపుణులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.