– 279 మందికి 10 మరుగు దొడ్లు
– అసౌకర్యాలు నడుమ ఆశ్రమ విద్యార్ధులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నాం, విద్యార్ధుల సమగ్ర విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ప్రభుత్వాధినేతలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. నలుగురు ఉండే ఇంట్లోనే అదనంగా ఒక్కరు బస చేయాలన్నా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలిసింది. అయితే 250 మంది విద్యార్ధులు కోసం నిర్మించిన వసతి గృహంలో రెండు వసతి గృహాలకు చెందిన విద్యార్థులకు వసతి అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని సున్నం బట్టి గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఆశ్రమ పాఠశాలల పరిస్థితి. గ్రామంలోని గిరిజన సంక్షేమ విద్యా విభాగం ఆధ్వర్యంలో 250 మంది విద్యార్ధులకు సరిపడా సౌకర్యాలతో కూడిన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 118 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 103 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. మిగతా 15 మంది ప్రైమరీ పాఠశాల విద్యార్థులు. కాగా, ఈ పాఠశాల ప్రాంగణంలోకి గతేడాది పెద్దవాగు ప్రాజెక్ట్ ఆశ్రమ పాఠశాలను తరలించారు. ఈ పాఠశాల నిర్వహణ కోసం సున్నం బట్టి పాఠశాలకు చెందిన భవన సముదాయాన్ని విభజించారు. ఈ పాఠశాల విద్యార్థుల కోసం ఆరు గదులు కేటాయించారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 172 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ సరిపడా నివాస గదులు, స్నానాల గదులు, మరుగు దొడ్లు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు వంట గది సైతం లేకపోవడంతో ఆరుబయటే వంట నిర్వహిస్తున్నారు. ఈ రెండు పాఠశాలలకు కలిపి 279 మంది విద్యార్థులకు 10 మరుగు దొడ్లు మాత్రమే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్ధులు పడుతున్న అవస్థలపై ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు కాంతయ్య, బాలును నవతెలంగాణ వివరణ కోరగా.. సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలుపుతూనే ఉన్నామని చెప్పారు. వారం కిందట ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఈ పాఠశాలను సందర్శించినప్పుడు సైతం ఈ విషయాన్ని వివరించామన్నారు. అశ్వారావుపేట ప్రస్తుత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సున్నంబట్టి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యను పరిష్కరిస్తారని స్థానికులు, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.