– అప్రమత్తమయిన గాంధీ ఆస్పత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. కొత్త సబ్ వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి సూచించిన విషయం విదితమే. దీంతో కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నోడల్ సెంటర్‌గా గతంలో సేవలందించిన గాంధీ ఆస్పత్రిని అవసరమైతే మరోసారి సేవలందించేందుకు సిద్ధం చేసినట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డులో బెడ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్స అందిస్తామని తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, ఇతర కోవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్‌కు చెందిన కొత్త సబ్ వేరియంట్ జేఎన్1తో కరోనా మళ్లీ విజంభిస్తోంది. కొన్ని రోజులుగా ఈ కేసులెక్కువగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఐదు కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆరుగురు చనిపోగా, ఎక్కువ కేసులు, మరణాలు కేరళ రాష్ట్రంలోనే నమోదు చేసుకున్నాయి. అయితే ఈ వేరియంట్ ప్రమాదకారి కాదు… అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.