విందు భోజనంలాంటి సినిమా

శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్‌ విజన్‌ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యూజిక్‌ బ్యానర్‌పై సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో కె.ఎస్‌.శంకర్‌ రావ్‌, జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వర్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు మురళీ మోహన్‌ మాట్లాడుతూ, ‘ఈ ట్రైలర్‌ చూడగానే మసాలాలు అన్ని దట్టించి తయారు చేసిన హైదరాబాద్‌ బిర్యానీలాగా అనిపించింది. ట్రైలర్‌ చూడగానే కథ, బ్యాగ్రౌండ్‌ ఏంటనేది అర్థమవుతుంది. హీరో శివ కంఠమనేని చాలా చక్కగా ఉన్నారు. మంచి పేరు వస్తుంది. ఆయన గత చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి ఎంపికైంది. దానికి బెస్ట్‌ మూవీ అవార్డు రావాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఇందులో సిన్సియర్‌, స్ట్క్రిక్ట్‌ ప్రొఫెసర్‌గా నటించాను. రాశి, నందితా శ్వేత కీలక పాత్రల్లో నటించారు. చక్కటి విందు భోజనంలా నవ రసాలున్న సినిమా. తప్పకుండా సినిమా అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నాను’ హీరో శివ కంఠమనేని అన్నారు. దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ, ‘ఇది ఫ్యాక్షన్‌ కథ కాదు..ఇందులో క్రిమినాలజీ ప్రొఫెసర్‌గా శివ కంఠమనేని నటించారు. యాక్షన్‌, డ్రామా, థ్రిల్లర్‌ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించాం’ అని చెప్పారు. ”మా లైట్‌ హౌస్‌ సినీ మ్యూజిక్‌ బ్యానర్‌ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. జనవరి 4న రిలీజ్‌ చేయటానికి సిద్ధమవుతున్నాం’ అని నిర్మాత వెంకటేశ్వరరావు అన్నారు.