న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నిర్వహించే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. ప్రధాని కార్యాలయం ఆయనకు ఆహ్వానం పంపినట్టు కేంద్ర అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇరుదేశాల మధ్య అభివృద్ధి చెందిన సాన్నిహిత్యం, విశ్వాసానికి నిదర్శనంగా ఈ ఆహ్వానం నిలుస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ-20 సదస్సులో మాక్రాన్ పాల్గొన్నారు. గతేడాది గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్‌సిసి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరవసారి. మాక్రాన్‌కు ముందు ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాక్వైస్ చిరాక్ వరుసగా 1976, 1988లో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1980, 2008 మరియు 2016 సంవత్సరాల్లో వరుసగా మాజీ అధ్యక్షులు గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ మరియు ఫ్రాంకోయిస్ హోలండ్‌లు పాల్గొన్నారు.