పోరాటాల పురిటిగడ్డపై పరశువు నెత్తిన సివంగి

పోరాటాల పురిటిగడ్డపై పరశువు నెత్తిన సివంగిస్త్రీ ఆది పరాశక్తి అంటూ పొగడ్తలతో అణిచేయడంతోనే చరిత్ర ముడిబడింది. అడుగడగునా అదృశ్య కచ్చడాలు ధరించే, భరించే స్వాతంత్య్ర మర్హత లేని సమాజ నేపథ్యంలో గట్టిగా మాట్లాడితే నాన్నా, ఎదురు తిరిగితే అమ్మా, లేటైతే అన్నా, రోడ్డు మీద అబ్బాయితో మాట్లాడితే పొరుగువాడూ, పైట సరిగ్గా వేసుకోపోతే ఇంట్లో పనోడూ శాశించగలిగే వెసులబాటును కల్పించిన ఈ సమాజంలో కొందరైనా గొంతు విప్పి ప్రశ్నించే స్థాయికి ఎదగడానికి తోడ్పడే అంశాలు యేవీ అని తరిచి చూస్తే, అది ఒక నికార్సైన చైతన్య స్థాయే అని చెప్పక తప్పదు. ఝాన్సీరాణి పోరాట స్పూర్తిలో స్వాభిమానం, ఆత్మ గౌరవం, హక్కుల్ని తిరస్కరించే విదేశీ దురాక్రమణ దారుడిపై ఏవగింపూ, నేలను కాపాడుకోవడం కోసం ప్రాణాలకైనా తెగించే వీరోచితత్వం కనబడితే – గున్నమ్మ నీ, ఐలమ్మనీ నడిపిన చైతన్యం వేరు. నిరుపేద కుటుంబాలకు చెంది, సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందిన అతి సామాన్యులు వీళ్ళు. గున్నమ్మ వెనక పున్నమ్మా, మహాలక్ష్మి, కౌసల్యా, తులశమ్మా అందరూ అలగా జనమే. ఈ వంటింటి కుందేళ్ళకు సివంగిలా గర్జించడం నేర్పిన చైతన్యం ఎక్కడిది? తలెత్తి భర్తని చూసే అలవాటు కూడా నేర్వని ఈ మనుధర్మచారిణి, కుమారీ శతకాల్ని వంట బట్టించుకున్న ఈ పొయ్యిలో పిల్లికి చిరుతలా చీల్చే శక్తి నిచ్చిన చైతన్యం ఎక్కడిది?
ఈ దుంపలోవి పిల్లతో, రైతు నాయకుడు చక్రపాణి తమ్ముడు చిన్నారాయణ, పంతుళ్ళ గురించి ఇలా అంటాడు, – ”పంతుళ్ళందరికీ శాస్త్రాలు తెలిసినా, రాజు చేసింది తప్పని తెలిసినా, అది చెప్పలేరమ్మా! గుడులూ మఠాలూ కట్టి, కృష్ణా, గోదావరి ప్రాంతాల నుంచి శాస్త్రాలు తెలిసిన పంతుళ్ళ కుటుంబాలను రప్పించి, వాళ్లు సుఖంగా బతకడానికి మాన్యాలు ఇచ్చారు రాజులు. ఆ మాన్యాలు దున్ని, పంటలు పండించి, వాళ్ళ గాదెల్లో పోసింది మన రైతులూ, కూలోళ్లే! చెమట చుక్క కింద పడకుండా, నెయ్యి చుక్కలతో సన్నబియ్యం ముద్ద దిగుతుంటే, వాళ్ళు ఎందుకు చెబుతారమ్మా బుద్ధులు?”
ఇదుగో ఇటువంటి నారాయణలో, చక్రపాణీలో నింపిన ఈ చైతన్యమే ఈ మగువల్ని సివంగుల్ని చేసింది.
రైతు ఉద్యమాలను నడిపే నాయకుల చైతన్యం గడీల్లో, కోటల్లో వున్నవాళ్లను ప్రశ్నించడం నేర్పింది. తెలంగాణా రైతాంగ పోరాటం ఎందరో ఇటువంటి వీరవనితల ధీరోదాత్త, సాధారణ మహిళల చైతన్యాన్ని శిఖరాయమానంగా చూపింది. వడిశలలూ, రోకలి బండలు, కారం పొడితోనే ప్రాణాలకు తెగించి పోరాడిన మహిళల్ని తయారుచేసింది. గడీలను కూల్చిన మహోగ్రపు ఆవేశాన్ని రుచి చూపింది. దుర్భేద్యమైన కోటగోడల్ని ఛిద్రం చేసింది.
గుడ్డి ద్వేషంతోనో, వ్యక్తి పగలతోనో, శత్రు సంహారం చేసే అపరిపక్వ సెల్యులాయడ్‌ చైతన్యంతో కాకుండా, కనీస హక్కులకోసం, బతుక్కోసం, మట్టి కోసం, చెట్టుకోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేయడంలో ముందుకురికిన ఈ మగువల తెగింపు వెనుక, వారి పోరాట పటిమ వెనుక, ఒక సుశిక్షిత చైతన్యం వుంది. చల్లపల్లి, మందస, ముసునూరు గడీలు ఇవ్వాళ ప్రాణం లేని రాళ్ల కుప్పలు, శిథిలమై పోయి, గడ్డిదుబ్బులు మొలిచి, అహంకారపు మూలుగులు వినిపించే, పీడనకు సమాధులు కట్టిన ఆనవాళ్లు. ఇదంతా యేం చెబుతోంది? ఒక జాతిని ఇంకో జాతీ, ఒక మనిషిని ఇంకో మనిషీ పీడించే న్యాయం ఇక చెల్లదని.
1940 – 50 మధ్య ఆంధ్ర ప్రాంతాల్లో వెల్లివిరిసిన చైతన్యంలో, ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ, సామాన్య ప్రజల్లో పోరాట పటిమకు అక్షరాభ్యాసం చేసింది. తలదించుకోవడానికి అలవాటు పడిన అర్భక ప్రాణాలకు ఏకంగా తలెత్తి ఎదురు తిరగడాన్ని నేర్పించింది. ఈ నేపథ్యంలో, శ్రీకాకుళం మందస ప్రాంతాల్లో, ముఖ్యంగా జాతాపు సవరలు వంటి గిరిజన తెగలు ఎక్కువగా ఉండే అటవీ భూముల్లో, భూస్వాముల, పెత్తందారీ వర్గాల దాస్టీకాలు అంతూ పొంతూ లేకుండా పోతున్న తరుణంలో, జమీందారీ గడీల పెత్తనాన్ని ఎదిరించి నిలబడిన వీర మహిళ గున్నమ్మ పోరాట స్ఫూర్తిని, ఒక డాక్యుమెంటరీగా, అదే సమయంలో, ఒక వాస్తవిక చారిత్రక గాధను, నవలా శిల్పంతో పఠితల హదయాన్ని కట్టిపడేసే రీతిలో రాసిన తీరు అద్భుతం. నవల ఆసాంతం చివరి కంటా చదివే వరకూ పఠితలను ప్రశాంతంగా ఉండనివ్వదు. నిజంగా జరిగిన సందర్భాల్ని నవలలో ఇమిడ్చిన తీరు ప్రశంసాపాత్రం. ఇందులో తారసిల్లే నాయకులూ, ఉద్యమ దృశ్యాలూ, సంఘర్షణలు, పోరాటాలూ నిజ జీవిత సందర్భాలు.
ఒక గొప్ప చారిత్రిక నేపథ్యాన్ని నవలికగా, సజీవంగా అక్షర బద్ధం చేసిన నల్లి ధర్మారావు గారి కృషి అనన్య సామాన్యం. ఉత్తరాంధ్ర భాషా సొబగుల్ని జీర్ణించుకున్న ధర్మారావు పాత్రోచిత సంభాషణలో ఆ మధురిమలు ఎంత చక్కగా పొదవి పట్టుకున్నారంటే మీరు ఉత్తరాంధ్రవాసులైతే ఇట్టే కనెక్ట్‌ అయిపోతారు. కారా మాస్టారి కథలూ అప్పలనాయుడు కథలూ చదివే సాహితీ ప్రియులైతే ఈ నవల మిమ్మల్ని రంజింప చేస్తుంది. అన్నింటికీ మించి ఒక చారిత్రక నేపథ్యంలో ఒక తెగువ కలిగిన మగువ పోరాట చైతన్యాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించే వారైతే ఈ నవల మీ హృదయాన్ని గాఢంగా తాకుతుంది.

– వి. విజయకుమార్‌, 8555802596