ఇటీవల కలల రంగు కవిత్వం (తొలి కవితా సంపుటి)తో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రతో అడుగుపెట్టారు రహీమొద్దీన్. ఒక చేయి తిరిగిన అనుభవజ్ఞుడైన కవి రాసిన కవితా పంక్తులుగా ఇందులోని కవితలు దర్శనమిస్తాయి. రహీమొద్దీన్ సాహిత్యం చదివిన వారు కాదు. కానీ జీవితాన్ని చదివిన వారు. మానవీయ విలువలు, వివక్ష పట్ల నిరసన, భవిష్యత్తు సమాజం పట్ల ఆలోచన వీరి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
రహీమొద్దీన్ కవిత్వంలో మనిషితనం ఉట్టిపడుతోంది. తన ఊర్లో ఇంటి పక్కన ఉండే రాములు బాబారు మరణించినప్పుడు కవి ఆవేదన ఆయనలోని మానవీయ గుణాన్ని బహిర్గత పరుస్తుంది.
”పుట్టిన మట్టిని సారవంతం చేసే/ వాన పాము లాంటి పుట్టుకలు కొన్నే ఉంటరు/ మా రాములు బాబాయి లెక్క…/ దొండపాదు లెక్క/ గుండె లోపలికి తీగలు బారిన ఆత్మీయతలాయే!/ మనిషి పోయినంత సులభం కాదు మరిచిపోవడం…” అంటూ రాములు బాబారు గుణాన్ని అద్భుతంగా కవిత్వీకరించారు. కల్మషం లేని గ్రామీణుల మనస్తత్వాన్ని ఈ కవితలో చిత్రీకరించాడు.
అనగనగా ఒక అమ్మ కథ కలల రంగు కవిత్వ సంపుటిలో ఎన్నదగిన కవిత. తల్లి గొప్పదనాన్నే కాదు ఆ తల్లి ఏ విధంగా వివక్షకు గురవుతున్నదో కూడా ఈ కవితలో చెప్పారు.
”ఎనుగంతా పారిన కంచ కాకర తీగకు/ మొదలెక్కడో దొరకనట్టు/ అంతం లేని అమ్మ దు:ఖపు తీగకు/ ఆది ఎక్కడో దొరకదు.” అంటూనే అమ్మ కళ్ళలో సుడిగుండాలను చూశానని, తాను రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డా అమ్మ ఏనాడు బాధపడలేదని తన మనసులోని బాధలకు రికాము లేని పనినే ఔషధంగా పూసుకున్నదని తల్లి సహనశీలతను అభివర్ణిస్తారు. బిడ్డగా,కోడలిగా, భార్యగా అనేక బాధ్యతలు నిర్వహించిన అమ్మ అన్ని చోట్ల ద్ణుఖాన్నే అనుభవించిందని ఆవేదనతో చెప్తారు.
”మసీదు మీనారు మీద నుంచి/ కనిపించే పండుగ నెలవంక కోసం అందరూ వెతుకుతుంటే/ అమ్మ ముఖంలో మెరిసే నెలవంక కోసం/ నేను వెతుకుతున్న…” అంటూ ఒక ఆశావహ దక్పథంతో కవితను ముగిస్తారు. అమ్మ చేతి ఆసరా అనే మరో కవితలో చీపురు గురించి చెప్పినట్లు కనిపించినా అంతర్లీనంగా ఆ కవిత నిండా అమ్మ కష్టమే దాగి ఉంది.
సాధారణంగా మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. ఇంట్లో అన్నీ తానై నడిపించే అర్ధాంగి లేని ఓ సాయం కాలాన్ని కవి జీర్ణించుకోలేని స్థితిని అద్భుతంగా కవిత్వీకరించారు
”తోడు లేనప్పుడు అంకెల విలువే కాదు/ ఆనందం విలువ కూడా తగ్గిపోతుందని/ ఆమె లేని ఈ సాయంత్రం/ జీవిత గణితంలోని తీసివేతల అధ్యాయం నాకు నేర్పింది…” అంటూ అర్ధాంగి లేని వెలితిని చక్కని కవిత్వంగా మలిచారు.
పెరుగుతున్న ప్రపంచీకరణ నగరీకరణ ఫలితంగా అంతరిస్తున్న పల్లెలు, ధ్వంసం అవుతున్న పర్యావరణం పట్ల ఆవేదన వీరి కవిత్వంలో కనిపిస్తున్నది. పొలం నెత్తురు కవితలో
”పట్నం పులి పంజా విసురుతున్నది/ నగరపు రోడ్డు కొండచిలువలా చుట్టేస్తున్నది/ దరిదాపుల్లో ఉండటమే పంట పొలం చేసుకున్న పాపం/ పచ్చని దేహం నిండా పచ్చి నెత్తురు తాగే కోరల గాట్లే” అంటూ సాగే ఈ కవితలో నగరం పల్లెలను ఎట్లా మింగేస్తున్నదో, ఆశల గాలానికి చిక్కిన రైతు బతుకు ఎలా విలవిలలాడుతున్నదో, పొలాలు ధ్వంసమై ధనవంతుల చేతుల్లో చిక్కుకున్న వైనాన్ని చక్కగా కవిత్వీకరించారు.
ప్రపంచీకరణ కార్పొరేటీకరణ చాప కింద నీరులా పాకి మనలను బందీ చేస్తున్న వైనాన్ని తెలుపుతూ రాసిన వీరి కవిత్వం పాఠకులను ఆలోచింపజేస్తుంది
”వాడి ఉపాయం వలలో చిక్కిన/ ఐక్యమత్యం మరచిన అమాయక పావురాలం కదా/ మనం కన్ను తెరిచేలోపే/ వాడు మన కలలన్నీ ఖరీదైన కవర్లో ప్యాక్ చేస్తడు/ రేపటి మన ముద్దని కార్పొరేట్ గద్దలు ఎత్తుకుపోయినంక/ ఈయాల రోడ్డు మీద మొలిచిన మేకులే రేపు మన కంచంలో మొలుస్తరు” అంటూ హెచ్చరిస్తున్నాడు.
పర్యావరణ స్పృహ వీరి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. చెట్లు పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రాసిన ఆకుపచ్చని దీవెన కవితలో
”ఊయల నుండి ఊత కర్ర దాకా తోడై నడిపించి/ విషాన్ని పీల్చుకొని అమత ఫలాలు దోసిళ్లతో పంచుతూ/ ఆకుపచ్చగా దీవించింది..” అని చెట్టు గొప్పదనాన్ని తెలియ చెప్పారు.
మనిషి ఆనంద విషాదాలకు మూలం మనసే. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఒక తాత్విక దక్పథంతో చెప్పారు రహీమొద్దీన్.
‘కష్టజీవి’ కి ఇరువైపుల నిలిచిన వాడే కవి అన్నారు శ్రీశ్రీ. శ్రమజీవుల పట్ల రహీమొద్దీన్ సరిగ్గా ఇట్లాంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. తన ఇంటిని నిర్మించిన భవన నిర్మాణ కార్మికులను చూసి వారి బతుకు చిత్రాన్ని కవిత్వంగా అల్లారు.
”పొద్దున్నే తాపీ పట్టుకున్న సూర్యులై/ తన కళ్ళలో సంతోషపు కిరణాలు మెరిపించే వాళ్ళు” అని తాపీ మేస్త్రీలను కృతజ్ఞతా పూర్వకంగా అభినందిస్తారు. రైతుల పట్ల కూడా రహీమొద్దీన్ ప్రేమ ఇలాగే కనిపిస్తుంది.
”వాళ్లు వానలో తడిసి పచ్చని పొలమై చిగురిస్తరు/ వాళ్లు బురదను బుజ్జగించి బువ్వ చేస్తరు/ అరకబట్టి ఆదమరిసి నిద్రపోతున్న మట్టి పొరలని తట్టి లేపుతరు” వంటి కవిత్వ పాదాలు అన్నదాతల పట్ల వీరికి ఉన్న మమకారాన్ని తెలుపుతున్నాయి. రైతు అయిన తన తండ్రిని స్మరించుకునే కవితలోనూ రైతు పట్ల సహానుభూతి కనిపిస్తుంది.
”అన్నం పెట్టే రైతును/ ఆడపిల్లను కన్న తండ్రిని/ తలెత్తుకొని బతకనిచ్చే దేశమా ఇది?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. మున్సిపల్ కార్మికుల సేవ గొప్పదనాన్ని మనసారా కీర్తించారు.
రహీమొద్దీన్ కవిత్వంలో అస్తిత్వ స్పృహ ఉన్నది. సమాజంలో తనకు ఎదురవుతున్న వివక్షను ప్రశ్నించే గుణం ఉన్నది. నేను ఒంటరిని కాదు అనే కవితలో తాను ఈ దేశ మూలవాసినని ద్వితీయ పౌరులుగా ఎంచబడుతున్న మైనారిటీల పక్షాన నిలబడి మాట్లాడగలిగారు.
”నేనెప్పుడూ పుట్టిన మట్టిని సాటి మనిషినీ/ సమానంగా ప్రేమించే వాణ్ణే/ మతాన్ని మసీదు గుమ్మం దగ్గరే వదిలి/ సోదర భావాన్నే తలపై పెట్టుకున్నాను” అని స్పష్టం చేశారు. తానెప్పుడూ ఒంటరిని కాదని, కుర్చీ కోసం తనను ఒంటరిగా చేసే కుట్రలను భగం చేస్తానని, గాయపడుతున్న సోదరులంతా తన వెంటే ఉంటారని చెప్పడం వీరి అస్తిత్వ దృక్పథానికి, సామాజిక స్పృహకు నిదర్శనం. కొత్త మచ్చ అనే మరో కవితలో కూడా ఇట్లాంటి స్పృహ కనిపిస్తున్నది. కరోనా వ్యాపిస్తున్న తొలిదశలో ఈ దేశంలోకి ముస్లింలే ఆ వ్యాధిని తీసుకువచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారాలు విచ్చలవిడిగా సాగాయి. బహుశా ఈ నేపథ్యంలో కవి స్పందన…
”పుట్టుకతో ఉన్న మచ్చలనే ఉతికి ఆరేసుకుంటూ/ నా వతన్ మీద నాకున్న ప్యార్ ను నిరూపించుకోలేక/ నా తిప్పలేదో నేను పడతాంటే/ అటు పోయి ఇటు పోయి కొత్త మచ్చ లెక్క/ నన్ను అంటుకున్నవేందే కరోనా?” అంటూ ప్రశ్నిస్తాడు. కలల రంగు సంపుటిలో ఉన్న మరో కవిత వెలుగు రాగాల పాట ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆవిర్భవించింది.
”నక్షత్రం కాలేకపోయినా/ మినుగురులై నలుగురు కదిలితే చాలదూ/ వెలుతురు నెత్తురులో ఉరకలెత్తడానికి/ ఐదు వేళ్ళు కలిస్తే ఆయుధమవుతుందని మరిచారా/ శక్తులను వ్యక్తులుగా విడదీస్తున్న కుట్రలను గమనించలేదా…” అని నిలదీస్తూ ప్రశ్నిస్తూ పాదాలకు కవాతులు పరిచయం చేయమంటాడు. శ్వాసకు జ్వలించడం నేర్పమంటాడు. కన్నీటి నిప్పు అనే మరొక కవితలోనూ పేదరికం తీవ్రమైనప్పుడు విప్లవం తప్పదని స్పష్టం చేస్తారు.
”మరిగే గుండెలో మంట పుడితే/ కన్నీళ్లలో నిప్పు రాజుకొని/ కార్చిచ్చు వ్యాపించక తప్పదు” అని హెచ్చరిస్తారు.
ప్రజలను చైతన్య పరచడమే నిజమైన కవి కర్తవ్యం. రహీమొద్దీన్ ఈ కర్తవ్య సాధనలో కతకత్యువయ్యారు.
రహీమొద్దీన్ స్త్రీల పట్ల సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సానుభూతి కలిగిన వారు. స్త్రీ పురుష సమానత్వాన్ని కాంక్షించే కవిత్వం వీరి కవిత్వ సంపుటిలో కనిపిస్తున్నది. దీన్ని స్త్రీవాద సంఘీభావ కవిత్వం అనవచ్చునేమో..
”ఇల్లు అతనిదే ఇంటి పేరు అతనిదే/ కనిపించని అనేక గాయాల సాక్షిగా/ నా దేహం మీది హక్కులన్నీ అతనివే…” పురుషాహంకార సమాజంలో ఎదుర్కొంటున్న అవస్థలను ఆవేదనభరితంగా ‘హింసాగృహం’ తెలియజేశారు కవితలో. ఈ కవిత చివరలో ఇట్లాంటి బాధితుల అడుగులన్నీ ఒక్కటై కవాతు చేస్తే హింసాగృహాలన్నీ ధ్వంసం అవుతాయనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.
ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రహీముద్దీన్ కవిత్వమంతా ఉటంకించదగినదే. ఇటీవల కాలంలో తెలుగులో సీరియస్ కవిత్వం రాస్తున్న యువతరం పెరుగుతుండడం హర్షనీయపరిణామం. తగుళ్ల గోపాల్, తుల శ్రీనివాస్, మెట్టా నాగేశ్వరరావు, చిగురాళ్లపల్లి ప్రసాద్, పల్లిపట్టు నాగరాజు, తండా హరీష్ వంటి కవుల కోవలోనివారే రహీమొద్దీన్. భవిష్యత్తు తెలుగు కవిత్వానికి భరోసా సంతకంగా నిలుస్తున్న రహీమొద్దీన్ కవిత్వానికి జేజేలు పలుకుతున్నాను.