మన్నించు

మన్నించుచెల్లెలా!
మన్నించు
బరిలో సివంగివైన నిన్ను
బయట లేడికూనని చేశారు!
పతకాలు తెచ్చినపుడు
దేశగౌరవం నిలిపిన
బేటీవంటూ అక్కున చేర్చుకున్నారు!
నీ ఆత్మగౌరవం కోసం గొంతెత్తినపుడు
నీవు బహువయ్యావు, బలి అవుతున్నావు!

అపుడెపుడో అగ్నిప్రవేశం ముందు
మూగబోయిన సీత గొంతూ
ఆనాడు నిండు సభలో
ఆక్రోశించిన ద్రౌపది గొంతూ
ఇపుడు మైకుల ముందు
పూడుకుపోయిన నీ గొంతూ
అన్ని ఒక్కటే!

కాలాలు మారినా,
తరాలు మారినా,
మారనిది మగువల గొంతే,
బేటీల గొంతు నొక్కుతూనే ఉన్నారు.
నీ కంట కన్నీరు ఒలుకుతుంటే
మాడరన్‌ కీచకుడు కేరింతలు కొట్టే ఉంటాడు.
బేటీ బచావో అన్న పెద్ద మనిషి
మౌనంగానే ఆనంద భాష్పాలు రాల్చే ఉంటాడు.
కానీ మా గుండెలు బద్దలవుతున్నాయి.
అయినా మేము ఏమీ చేయము?
మహా అయితే ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్‌,
కుదరకపోతే ఒక ఏమోజీతో సరిపెట్టుకుంటాం!

బూట్లు పక్కన పెట్టి అస్త్ర సన్యాసం చేస్తుంటే
మేమంతా బూట్లు ఏ కంపెనీవని చూస్తున్నాం!
ఏ శర్మో, కోహ్లీనో బ్యాటు పక్కన పెట్టి ఉంటే …
దేశం ఈ పాటికి అగ్నిగుండం కాకపోవునా?
నీవు మా చెల్లివే
కానీ నీ కోసం ఏమీ చెయ్యలేము.
అందుకే మన్నించు చెల్లెలా!
మన్నించు.

– వీరాంజనేయులు, 9490909780