శ్రీనగర్ : మెహబూబా ముఫ్తీపై జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ విధించిన గృహనిర్బంధాన్ని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) సోమవారం ఖండించింది. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్‌లో పర్యటించనున్నట్టు ముఫ్తీ ప్రకటించడంతో ప్రభుత్వం ఆమెపై నిర్బంధం విధించినట్టు పార్టీ తెలిపింది. ప్రభుత్వ అనైతిక చర్యను ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ చర్యలు అసంబద్దమైనవనీ, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. ‘ఆర్మీ కస్టడీలో మరణించిన బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు, అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు ముఫ్తీ సూరన్ కోట్‌లో పర్యటించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం బలవంతంగా గృహనిర్బంధం విధించింది’ అని పీడీపీ ఎక్స్‌లో పేర్కొంది. ఆకస్మిక దాడిపై విచారణ పేరుతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా భద్రతాదళాలు పలువురు యువకులను అదుపులోకి తీసుకోవడాన్ని ఆదివారం ముఫ్తీ ఖండించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ‘డీకేజీ సైనిక శిబిరం బాంఘియా పంచాయితీ పరిధిలోని థానమండి ప్రాంత పౌరులను బలవంతంగా తీసుకువెళ్లింది. వారి సమాచారంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. వారు కస్టడీలో మరణించడంతోనే కుటుంబసభ్యులను చూసేందుకు అనుమతించలేదు ” అని ముఫ్తీ ఎక్స్‌లో పేర్కొన్నారు. గత గురువారం సైనికుల వాహనాలపై ఉగ్రవాదులు మెరుపు దాడి జరిపిన ఘటనలో నలుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. దాడి అనంతరం 27 మరియు 42 ఏండ్ల వయస్సు మధ్యగల ముగ్గురు పౌరులను విచారణ పేరిట ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే డిసెంబర్ 22న వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.