నుమాయిష్‌కు రెడీ

Ready for Numaish– జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహణ ఏర్పాట్లలో సోసైటీ సభ్యులు దాదాపు 2400 స్టాల్స్‌ ఏర్పాటు :
– నగరానికి చేరుకుంటున్న వివిధ రాష్ట్రాల వ్యాపారులు
– వినియోగదారుల కోసం మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి..
– సీఎం చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌కు వేళైంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో 83వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌) వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. 46రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్‌ ప్రదర్శనను ప్రారంభించేందుకు సొసైటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి 2400 స్టాల్స్‌
గతేడాది నుమాయిష్‌లో దాదాపు 2300 స్టాళ్లను ఏర్పాటు చేయగా.. ఈసారి 2400 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులను ఆహ్వానించే ప్రక్రియను పూర్తి చేసిన సొసైటీ.. స్టాల్స్‌ నిర్మాణాన్ని ప్రారంభించింది. దాదాపు 85-90 శాతంపైగా పనులు పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత ఏడాదికి భిన్నంగా స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు మైదానంలో లే-అవుట్‌ పనులు తీర్చిదిద్దుతున్నారు. ఎగ్జిబిషన్‌ ప్రవేశ ద్వారాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు రూ.40గా నిర్ణయించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు నగర ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సహకారంతో ఖాళీ స్థలాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. నుమాయిష్‌ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.20 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది.
వృద్ధులు, నడవలేని వారికి ప్రత్యేక ఏర్పాట్లు
వృద్ధులు, నడవలేని వారి కోసం వాహనాల ద్వారా సందర్శన, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. వృద్ధులు, నడవలేని వారికి ఎగ్జిబిషన్‌ లోపల ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఈసారి ఎగ్జిబిషన్‌లో ఫిష్‌ అక్వైరింగ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 60 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో ఈ అక్వైరింగ్‌ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సోసైటీ సభ్యులు చెబుతున్నారు. నుమాయిష్‌ను దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ పలు డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. నాంపల్లి, గాంధీ భవన్‌ మెట్రో స్టేషన్‌లు ఎగ్జిబిషన్‌ మైదానానికి సమీపంగా ఉంటాయి. మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌, రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను అర్ధరాత్రి 12 గంటల వరకు నడిపే అవకాశం ఉంది.
25లక్షలకు పౖగా సందర్శన
ఈసారి నుమాయిష్‌ను 25 లక్షల మందికిపైగానే సందర్శించే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసే వ్యాపారులు ముందుగా దరఖాస్తు చేసుకుంటారు. ఈసారి 3500 దరఖాస్తులు వచ్చాయని సోసైటీ సభ్యులు తెలిపారు. ఇందులో సీనియార్టీని బట్టి స్టాల్స్‌ అప్పగించారు. ఫ్యాషన్‌, గార్మెంట్స్‌, టెక్స్‌టైల్స్‌, హాండ్లూమ్స్‌, హౌమ్‌ నీడ్స్‌, జ్యూy ెల్లరీ, బ్యూటీ, హెల్త్‌ కేర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆటోమూవీస్‌, ఫుడ్‌ కోర్ట్‌తోపాటు తదితర వాటికి సంబంధించి స్టాల్స్‌ ఏర్పాటు కానున్నాయి. పిల్లల కోసం జారురైడ్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. వినియో గదారుల కోసం నుమాయిష్‌ మొబైల్‌ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో స్మార్ట్‌ ఫోన్‌లలో యాప్‌ స్టోర్‌ల నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. కాగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.