– భర్తీ కాని వేలాది పోస్టులు
– పనిభారంతో కుదేలు
– మహిళా ప్రాతినిధ్యం అంతంతే
– మౌలిక సదుపాయాలకూ కొరతే
జైలులో డిటెన్యూలుగా ఉన్న వారు తమ కేసు ఎప్పుడు ట్రయల్ కోర్టులో విచారణకు వస్తుందా అని దశాబ్ద కాలానికి పైగా చకోర పక్షుల మాదిరిగా ఎదురు చూస్తున్నారు. సివిల్ కోర్టులో 30-40 సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న ఆస్తి వివాదానికి ఎప్పుడు మోక్షం వస్తుందా అని వృద్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. న్యాయస్థానాలలో చోటుచేసుకుంటున్న ఈ అసాధారణ జాప్యానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి.
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ ప్లానింగ్ సంస్థ ఈ అంశంపై ‘న్యాయ వ్యవస్థ పరిస్థితి’ పేరిట ఓ నివేదికను రూపొందించింది. అందులో కొన్ని కీలక అంశాలు కన్పిస్తున్నాయి. భారతీయ న్యాయ వ్యవస్థపై సుదీర్ఘ కాలంగా పనిభారం పెరుగుతోంది. న్యాయ వ్యవస్థలో ఖాళీలు, లోపించిన వైవిధ్యం, న్యాయమూర్తులు-కక్షిదారులకు మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలను ఈ నివేదిక పరిశీలించింది. అక్టోబర్ నాటికి దేశంలోని ఉన్నత, సబార్డినెట్ కోర్టులలో ఐదు కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయని నివేదిక తెలిపింది. కేసులను పరిశీలించి, తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులలో కేవలం 20,580 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి దేశంలోని హైకోర్టులలో 1,114 జడ్జి పోస్టులు మంజూరు కాగా 347 ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా జిల్లా న్యాయ వ్యవస్థలో ఏప్రిల్ నాటికి 25,081 జడ్జి పోస్టులు మంజూరై ఉండగా కేవలం 19,781 మంది మాత్రమే పని చేస్తున్నారు. అంటే 5,300 జిల్లా జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న మాట.
జనాభా, కేసుల ప్రాతిపదికగా…
పది లక్షల జనాభాకు కావాల్సిన జడ్జిల సంఖ్యపై దామాషాను నిర్ణయించాలని లా కమిషన్ 1987లోనే సూచించింది. జనాభా ఆధారంగా ఉండాల్సిన అధికారులు, పోలీసుల సంఖ్యను ఎలా నిర్ణయిస్తామో జడ్జిలను కూడా అలాగే నిర్ణయించుకోవాలని తాజా నివేదిక సైతం అభిప్రాయపడింది. ప్రస్తుతం పది లక్షల మంది జనాభాకు 10 మంది జడ్జిలు ఉండగా ఈ సంఖ్యను యాభైకి పెంచాలన్న సూచనను సుప్రీంకోర్టు 2002లో ఆమోదించింది. జడ్జిల సంఖ్యను నిర్ణయించడానికి జనాభాను మాత్రమే కాకుండా కేసుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని లా కమిషన్ సూచించింది. ఒక్కో జడ్జి సగటున ఎన్ని కేసులను పరిష్కరించగలడో చూసి దాని ఆధారంగా ప్రస్తుతం పెండింగులో ఉన్న, కొత్తగా వస్తున్న కేసులను పరిష్కరించడానికి ఎంతమంది జడ్జిలు అవసరమో నిర్ణయించాలని కమిషన్ తెలిపింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల పరిష్కారానికి పలు కమిటీలు అనేక సూచనలు చేశాయి. ఖాళీల సంఖ్యపై హైకోర్టులు నోటిఫికేషన్ జారీ చేయడానికి, ఎంపికైన వారు విధులలో చేరడానికి మధ్య 273 రోజుల వ్యవధి అవసరమని ఓ తీర్పు సందర్భంగా న్యాయస్థానం నిర్దేశించింది. అయితే కేవలం తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే దీనికి కట్టుబడి ఉన్నాయని సుప్రీంకోర్టు తాజా అధ్యయనం తెలిపింది.
కానరాని వైవిధ్యం
న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్ విధానమేదీ అమలులో లేనప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాలను పరిశీలించే టప్పుడు వైవిధ్యాన్ని చూపాలని కొలీజియం స్పష్టంగా చెప్పింది. అయితే ప్రస్తుతం ఆ వైవిధ్యం కానరావడం లేదు. ఉదాహరణకు అక్టోబర్ 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు ఉండగా వారిలో మహిళలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. హైకోర్టులలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. దేశంలోని హైకోర్టు లలో 767 మంది శాశ్వత, అదనపు జడ్జిలు ఉండగా వారిలో కేవలం 103 మంది మహిళా జడ్జిలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థలో మాత్రం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 36.33%గా ఉండడం కొంత సంతోషించదగిన పరిణామం. జిల్లా న్యాయ వ్యవస్థలో జ్యుడీషియల్ అధికారులను నియమించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత హైకోర్టు. లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు జ్యుడీషియల్ పరీక్షలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. తాజా నివేదిక 16 రాష్ట్రాలలో పరిస్థితిని పరిశీలించగా వాటిలో 14 రాష్ట్రాలు జూనియర్ స్థాయి సివిల్ జడ్జిల నియామకపు పరీక్షలో 50%కి పైగా మహిళా జ్యుడీషియల్ అధికారులను నియమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 65% మహిళా జ్యుడీషియల్ అధికా రులు ఎంపికయ్యారు. ఇక్కడ గమనిం చాల్సిన మరో ముఖ్యమైన విషయ మేమంటే ప్రస్తుతం పని చేస్తున్న మహిళా జ్యుడీషియల్ అధికారుల కనీస అవసరాలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
మరుగుదొడ్లకూ లోటే
దేశంలోని న్యాయస్థానాలలో మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల సదుపాయం కూడా సరిగా లేదని నివేదిక ఎత్తిచూపింది. మహిళల కోసం నాప్‌కిన్ వెండింగ్ మిషన్ల వంటి కనీస వసతులు కలిగిన టాయిలెట్లు కేవలం 6.7% మాత్రమే ఉన్నాయి. హైకోర్టులలో జడ్జిల సంఖ్యకు సరిపోను వాష్‌రూములు ఉన్నాయి. దిగువ కోర్టులలో మాత్రం పరిస్థితి ఘోరంగానే ఉంది. ఆ కోర్టులలో నామమాత్రంగా వాష్‌రూములు ఉన్నప్పటికీ వాటిలో పని చేసేవి తక్కువే. పగిలిన తలుపులు, ముక్కలైన నాపరాళ్లు మనకు దర్శనమిస్తుంటాయి. నీటి సరఫరా కూడా సరిగా ఉండదు.జిల్లా కోర్టులలో న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారుల అవసరాలకు సరిపడా మరుగుదొడ్లు లేవని 12 హైకోర్టులు సమాచారం ఇచ్చాయి. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పలు సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
భర్తీకి నోచుకోని పోస్టులు
సుప్రీంకోర్టు నివేదిక బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని జిల్లా కోర్టులలో కుల వైవిధ్యాన్ని పరిశీలించింది. ఈ రాష్ట్రాలలో 1,389 సివిల్ జడ్జి (జూనియర్ స్థాయి) పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇతరుల కోసం 766 పోస్టులు రిజర్వ్ చేశారు. అయితే రిజర్వ్ చేసిన పోస్టులలో 37.5% పోస్టులు భర్తీ కాలేదు. వీటితో కలిపి మొత్తంగా 66.3% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక హైకోర్టులలో 2018-2023 మధ్యకాలంలో 650 మంది జడ్జిలు నియమితులు కాగా వారిలో 492 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారే. ఈ నేపథ్యంలో సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారిని జడ్జిలుగా నియమించి ప్రధాన స్రవంతి విధాన నిర్ణయ ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయాలని, వారికి సాధికారత కల్పించాలని నివేదిక సూచించింది.