కొత్త ఏడాది వస్తుందనగానే ప్రతి ఒక్కరిలోనూ కచ్చితంగా ఎంతో కొంత ఎగ్జైట్ మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా మనలో చాలా మంది డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి కరెక్టుగా పన్నెండు గంటల సమయంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో బేకరీలలో దొరికే కేకులకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇంట్లోనే చాలా ఈజీగా అది కూడా అతి తక్కువ ఖర్చుతో న్యూ ఇయర్ కేకులని తయారు చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం…
ఆరెంజ్ కేక్
కావల్సిన పదార్థాలు : వెన్న – అరకప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు, గుడ్లు – ఆరు, ఆరెంజ్ – రెండు (తొక్కతీసి కట్ చేసిన పళ్లు), కేక్ పౌడర్ – నాలుగు కప్పులు, అల్యూమినియం పేపర్ – చిన్నది, పాలు – పావు కప్పు, చక్కెర పొడి – ఒక కప్పు, కొబ్బరి తరుగు – ఇష్టం వుంటే.
తయారు చేసే విధానం : పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వెన్న వేసుకుని బాగా మిక్స్ చేయాలి. చక్కెర, గుడ్లు కూడా బాగా వేసి కలుపుకోవాలి. అందులో ఆరెంజ్ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇందులో పాలు, పిండి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. మిగిలిన పదార్థాలు కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని మరీ మందంగా లేదా మరీ పలుచగా కాకుండా కేక్ పాన్‌లో వేసుకోవాలి. మిశ్రమాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్‌ని రాయాలి. దీన్ని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 45 నిమిషాల పాటు ఓవెన్‌లో 350 ఫాంన్ హీట్ వద్ద వుంచాలి. ఎంతో రుచిగా వుండే కేక్ రెడీ. దీనిపై క్రీమ్‌తో డెకరేషన్ చేసుకోవాలి. దానిపై చెర్రీస్ అమరిస్తే మరింత బాగుంటుంది.
చాక్లెట్ కాష్యూనట్ ట్రఫెల్
కావల్సిన పదార్థాలు : జీడిపప్పు పొడి – అరకేజీ (జీడిపప్పుని మిక్సీలో పొడి చేసుకోవాలి), గుడ్లు – తొమ్మిది, కోకోపొడి – వంద గ్రాములు, బేకింగ్ పౌడర్ – ఐదు గ్రాములు, క్యాస్టర్ షుగర్ – ఐదు వందల గ్రాములు, మైదా – అరకిలో, ట్రఫెల్ కోసం – పావుకిలో ఫ్రెష్ క్రీం, డార్క్ చాక్లెట్ – అరకిలో.
తయారు చేసే విధానం : గుడ్లూ, క్యాస్టర్ షుగర్ బాగా కలుపుకొని బీటర్ సాయంతో గిలకొట్టాలి. ఇప్పుడు జీడిపప్పు పొడి, కొకొపొడి, మైదా, బేకింగ్ పొడీ కలుపుకుని కోడిగుడ్ల మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు కేకులు తయారు చేసే కేక్ టిన్ తీసుకొని అందులో ఈ మిశ్రమం వేసి ఓవెన్‌లో 150 డిగ్రీల వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి. ఇంకో పాత్ర తీసుకొని అందులో చాక్లెట్, తాజా క్రీం కలుపుకొని చాక్లెట్ కరిగేంత వరకూ వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ట్రఫెల్. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కేక్‌ని గిన్నెలోంచి బయటకు తీసి దానిని మూడు పొరలుగా కత్తిరించుకుని, శాండ్‌విచ్ తరహాలో ఒక్కో పొరకూ ట్రఫెల్ రాయాలి. పై పొరపై మిగిలినదంతా వేసేయాలి. గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వడ్డించుకోవచ్చు.
యాపిల్ కేక్
కావల్సిన పదార్థాలు : యాపిల్ ముక్కలు – ఐదు కప్పులు (తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ చేసినవి), చక్కెర – కప్పు, బ్లాక్ రెయిసిన్స్ – కప్పు, డ్రై ఫ్రూట్స్ – కప్పు, పీకాన్స్ – కప్పు, వెజిటేబుల్ ఆయిల్ – పావు కప్పు, వెనీలా – రెండు స్పూన్లు, గుడ్డు – బాగా బీట్ చేసినది ఒకటి, మిక్స్‌డ్ కేక్ ఫ్లోర్ – రెండున్నర కప్పులు, బేకింగ్ సోడా – ఒకటిన్నర కప్పు, దాల్చిన చెక్కడ పొడి – ఒక స్ఫూను.
తయారు చేసే విధానం : ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, చక్కెర, పీకాన్స్, రెయిసిన్స్ అన్నీ వేసుకోవచ్చు. దీన్ని 35-40 నిమిషాల పాటు ఓవెన్‌లో పెట్టాలి. టెంపరేచర్ 350 ఫారన్ హీట్ వుండేలా చూసుకోవాలి. దీన్ని సర్క్ చేసే ముందు ఫ్రిజ్‌లో పెట్టి కాస్త కూల్‌గా వుండేలా అందించాలి.
స్వీట్ రైస్ కేక్
కావల్సిన పదార్థాలు : బియ్యప్పిండి – వంద గ్రాములు, మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున, బ్రౌన్ షుగర్ – అరవై గ్రాములు, నీళ్లు – కప్పు(గోరువెచ్చగా చేసుకోవాలి), నూనె – రెండు టేబుల్ స్పూన్లు, గుడ్డు – ఒకటి.
తయారు చేసే విధానం : ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్‌ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్ హెల్డ్ మిక్సర్‌తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఈ మిశ్రామాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్‌పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి.