నిజామాబాద్‌ నుంచి.. ప్రధాని పోటీచేస్తే ఆహ్వానిస్తా

–  రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తుండదు : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌
నవతెలంగాణ-ఆర్మూర్‌
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తే ఆహ్వానిస్తానని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లిలో రైల్వే పనులను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఓబీ పనులకోసం కేంద్ర ప్రభుత్వం డిపాజిట్‌ చేసిన రూ.15 కోట్ల నిధులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ పాలెపు రాజు, నాయకులు జీవి నరసింహా రెడ్డి, పల్లె గంగారెడ్డి, ధ్యాగ ఉదరు, కంచెట్టి గంగాధర్‌, పెర్కిట్‌ దుగ్గి విజరు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.