నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీఆర్‌ఎస్ మునిగిపోతున్న నావ అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్‌సభ ఎన్నికల కసరత్తుపై ప్రధానంగా సమావేశంలో చర్చించామని తెలిపారు. తెలంగాణలో ఏడు నుంచి 14కు ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. ఎనిమిది సీట్లే గెలిచినప్పటికీ నైతికంగా తాము విజయం సాధించామన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు విసుగుచెంది తగిన బుద్ధి చెప్పారని చెప్పారు. అయితే, బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ లాభపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయే నావే అన్నారు. పదేండ్లలో కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజల జీవన ప్రమాణాలు మారలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గ్రామస్థాయి వారీగా సమీక్షలు జరుపుతున్నామని తెలిపారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరశంఖాన్ని హోంమంత్రి అమిత్‌షా మోగించారన్నారు. మూడోసారి మోడీనే ప్రధాని చేయాలనే సంకల్పంతో ప్రజలున్నారని చెప్పారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతావాటన్నింటిలోనూ బీజేపీనే పైచేయి సాధించిందన్నారు. తెలంగాణలో 2019లో 20 శాతం ఓట్ల శాతంతో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్నామనీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో 10కిపైగా స్థానాలు గెలుస్తామని నొక్కి చెప్పారు. తమకు ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం హామీలు తమకు కలిసొచ్చాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు.