
నవతెలంగాణ-గోవిందరావుపేట : రైతులందరికీ రైతు భరోసా వర్తింప చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కోటగడ్డ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ అల్లం రాజకుమార్ కు ఈ మేరకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ లక్నవరం చెరువు కింద 1953- 54 లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి పేరుతో రాష్ట్రములోని వివిధ జిల్లాల నుండి రైతుల్ని రమ్మని ప్రకటన చేసింది దాని ఆధారంగా వేలాది మంది రైతులు గోవిందరావుపేట మండలంలోకి రావడం జరిగింది దాదాపు మూడు తరాల నుండి ఇక్కడ అనేకమంది పేద రైతులు జీవనం కొనసాగిస్తున్నారు వారికి గత ప్రభుత్వంలో రైతు పట్టాలు లేక రైతుబంధు రాక, బీమా వర్తించక ఏజెన్సీలో అనేకమంది గిరిజనేతర పేద రైతులు ఎలాంటి హక్కులు లేక బ్యాంకు రుణాలు రాక, ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఏజెన్సీలో కాస్త కబ్జాలో ఉన్న రైతులందరికీ ప్రభుత్వం రైతు భరోసా వర్తింపజేయాలని తుమ్మల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ లో రైతులందరి నీ దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏనుగు శేఖర్ రెడ్డి, మట్ట సోమిరెడ్డి, పోతరాజు కృష్ణ, కొత్త సంజీవరెడ్డి, పుసులూరి రాంబాబు, నిడుమోలు రామయ్య, ఏనుగు యాదిరెడ్డి, మట్ట వెంకట పాపిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.