– సఫారీ గడ్డపై కలగానే టెస్టు సిరీస్
– బ్యాటింగ్ వైఫల్యం నిజమే కానీ..
– బౌలర్ల చెత్త ప్రదర్శనే ఓటమికి కారణం
32 ఏండ్లు. పదికిపైగా పర్యటనలు. వైట్‌బాల్ ఫార్మాట్లో విజయం దక్కినా.. టెస్టు సమరంలో మాత్రం సఫారీ సవాల్ అలాగే మిగిలిపోయింది. విదేశీ గడ్డపై టీమ్ ఇండియాకు గొప్ప రికార్డులు ఏమీ లేవు. ఆధునిక క్రికెట్లో గంగూలీ, ధోని, కోహ్లి సారథ్యంలో భారత్ అనితర సాధ్య విజయాలు సాధించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు అందుకుంది. కానీ దక్షిణాఫ్రికాలోనే భారత్‌కు టెస్టు సిరీస్ విజయం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. గత రెండు పర్యటనల్లో ఆ విజయానికి చేరువైనా.. ఈసారి కొట్టడం ఖాయమనే భావన కనిపించింది. సెంచూరియన్ టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం సుస్పష్టం. కానీ టెస్టు విజయాలు సాధించేందుకు పరుగుల వేట సాగించే బ్యాటర్ల కంటే.. వికెట్ల వేట సాగించే బౌలర్లే కీలకం. కీలక దక్షిణాఫ్రికా పర్యటనలో ఇప్పుడు టీమ్ ఇండియా పేసర్ల పరేషాన్ ఎదుర్కొంటుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
టెస్టు మ్యాచ్‌లో విజయం తేల్చేది నాణ్యమైన పేసర్లు. ఓ ఎండ్ నుంచి బౌలర్‌ను మార్చినప్పుడు..బంతి అందుకున్న కొత్త బౌలర్ సత్తా, సామర్థ్యం మ్యాచ్ ఫలితాన్ని శాసించగలదు. సహజంగానే బ్యాటర్లు కాస్త బలహీన బౌలర్‌ను టార్గెట్ చేస్తారు. నాణ్యమైన బౌలర్ నుంచి బంతి మారగానే.. చెత్త బౌలర్‌కు చుక్కలు చూపిస్తారు. ఆ ఓవర్లో అలవోకగా పరుగులు పిండుకుని.. నాణ్యమైన బౌలర్ ఓవర్లో ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. భారత్, దక్షిణాఫ్రికా టెస్టులో టీమ్ ఇండియానే ఇందుకు చక్కటి ఉదహరణ. సెంచూరియన్ టెస్టులో టీమ్ ఇండియా సీనియర్ బౌలర్లు జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లు 69.4 ఓవర్లలో 201 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. ఈ స్కోరుకు ముగ్గురు ప్రధాన బౌలర్ల ప్రదర్శన మ్యాచ్‌ను లెవల్ చేసింది. కానీ జట్టులోని మరో ఇద్దరు అనుభవం లేని పేసర్లు శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ కష్ణలు 39 ఓవర్లలోనే 194 పరుగులు సమర్పించుకున్నారు. ఇక్కడే దక్షిణాఫ్రికాకు టీమ్ ఇండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ లైనప్ ప్రదర్శన దారుణం. కానీ బ్యాటింగ్ వైఫల్యం కంటే బౌలర్ల లయ తప్పిన బౌలింగే భారత్‌కు ఓటమిని మిగిల్చింది. పిచ్ నుంచి మంచి పేస్, బౌన్స్ లభించినా మన బౌలర్లకు పెద్దగా రాణించలేదు. దక్షిణాఫ్రికాలో గత ఐదు పర్యటనల్లో భారత్ కనీసం నాలుగు సార్లు ఓ టెస్టు మ్యాచ్‌లోనైనా విజయం సాధించగలిగింది. అందుకు ప్రధాన కారణం, నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉండటమే. సఫారీ పేస్ విభాగం అదనపు బలాన్ని మన పేస్ దళం సమం చేయటంతోనే అది సాధ్యపడింది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించటం లేదు. బ్యాటర్లపై బుమ్రా, సిరాజ్, అశ్విన్ పెంచిన ఒత్తిడిని.. శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ కష్ణలు తొలగిస్తున్నారు. ఇది సఫారీ బ్యాటర్లకు వరంగా మారింది. బ్యాటింగ్ లైనప్‌కు సైతం సెంచూరియన్ ఓటమిలో బాధ్యత ఉంటుంది. కానీ పేస్‌కు గొప్పగా సహకరించే పిచ్‌లపై అద్బుత ప్రదర్శన చేయాల్సిన బాధ్యత పేస్ విభాగానిదే. భారత పేసర్లు సెంచూరియన్‌లో ఈ అంశంలో వంద శాతం విఫలమయ్యారు.
స్వర్ణయుగం ముగిసిందా?
భారత పేస్ విభాగంలో స్వర్ణయుగం ముగిసిందా అనే అనుమానం మొదలైంది. మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రాలతో కూడిన పేస్ దళం టెస్టుల్లో భారత్‌కు అసమాన విజయాలు అందించింది. 2018-2021 సమయంలో భారత పేస్ విభాగం వరల్డ్ నం.1 పేస్ బందంగా కితాబు అందుకుంది. ఈ నలుగురు పేసర్లలో మహ్మద్ సిరాజ్ మినహా ఎవరూ బీసీసీఐ వ్యవస్థ నుంచి తయారైన పేసర్ కాదు. ఓ పేసర్‌ను రాష్ట్ర క్రికెట్ సంఘం పట్టించుకోలేదు. మహ్మద్ షమి ఆసీస్‌తో ఆరంగ్రేట సిరీస్‌లోనే ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఉమేశ్ యాదవ్ 100 వికెట్లు కూల్చినా.. చెత్త సగటు సాధించిన పేసర్‌గా విమర్శలు ఎదుర్కొన్నాడు. మహ్మద్ సిరాజ్ ప్రతిభను గుర్తించిన బోర్డు.. అతడిని రంజీ ట్రోఫీ, దేశవాళీ టోర్నీలు సహా భారత్-ఏ తరఫున ఆడించింది. సిరాజ్ అంశంలోనే బీసీసీఐ వ్యవస్థలు కలిసి పని చేశాయి. బుమ్రా సహజసిద్ధ ప్రతిభావంతుడు. ఒక్కసారి వెలుగులోకి వచ్చాక.. అతడు వెనుదిరగాల్సిన అవసరం రాలేదు. షమి, ఉమేశ్, ఇషాంత్‌లు కఠోర సాధనతో ప్రపంచ శ్రేణి హౌదా దక్కించుకున్నారు. ఈ నలుగురు పేసర్లు ఏకకాలంలో సూపర్ ఫామ్‌లో ఉండటం అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లికి వరంగా మారింది. స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు సైతం జట్టులో ఉన్నారు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతూనే ఉండేది. ఫలితంగా క్రమం తప్పకుండా వికెట్ల జాతర సాగేది. ఇషాంత్, ఉమేశ్ జాతీయ జట్టుకు దూరం కాగా.. షమి గాయంతో సఫారీ సిరీస్‌కు దూరమయ్యాడు. బుమ్రా, సిరాజ్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. మరో ఎండ్ నుంచి సహకారం దక్కటం లేదు. దీంతో భారత పేస్ దళం స్వర్ణ యుగం ముగిసిందనే వాదన వినిపిస్తోంది.
గతి తప్పిన మేనేజ్మెంట్!
కరోనా మహమ్మారితో బీసీసీఐ టాలెంట్ మేనేజ్మెంట్ గతి తప్పింది. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో గాయాలకు గురైన క్రికెటర్లకు రిహాబిలిటేషన్ సెంటర్ సేవలు అందిస్తున్నారు. కానీ ప్రతిభావంతులైన దేశవాళీ క్రికెటర్లకు ప్రతిభకు సాన పట్టడం లేదు. ఈ సమయంలో భారత్-ఏ విదేశీ పర్యటనలు సైతం తగ్గిపోయాయి. ఆ ప్రతికూల ప్రభావం ఇప్పుడు సఫారీ సిరీస్‌లో కనిపిస్తుంది. ప్రసిద్ కష్ణ అరంగ్రేట మ్యాచ్‌లో తేలిపోయాడు. తొలి టెస్టులో మెరవాలని లేదు. కానీ కనీస ప్రభావం చూపకపోవటం ఆలోచించాల్సిన విషయమే. ఇక శార్దుల్ ఠాకూర్ గత ఐదు టెస్టులో ఏకంగా 56 స్ట్రయిక్ రేట్‌తో కొనసాగుతున్నాడు. పేస్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఠాకూర్ సగటున పది ఓవర్లకు ఓ వికెట్ పడగొడుతున్నాడు. ప్రసిద్ కష్ణ ఫస్ట్ క్లాస్ అనుభవం సైతం అంతంతే. ఇక తొలి టెస్టులో రెండో రోజు లంచ్ విరామం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహలు సైతం విమర్శలకు అవకాశం కల్పించాయి. పసలేని బంతులు సంధిస్తున్న ప్రసిద్, శార్దుల్లకు రోహిత్ బంతి అందించాడు. ఓ వైపు పరుగుల వరద పారుతుండగా.. మరో ఎండ్‌లో వికెట్ల వేట సాగించినా ఫలితం లేకుండా పోయింది.
ముందుంది కఠిన పరీక్ష
న్యూఇయర్‌లో కేప్‌టౌన్ టెస్టు తర్వాత భారత్ స్వదేశంలో మరో సవాల్‌కు సిద్ధం కానుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. భారత్‌లో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్వన్, రవీంద్ర జడేజాలు వికెట్ల వేట చూసుకుంటారు. అయినా, పేస్ విభాగం కాస్తో కూస్తో బలంగానే ఉండాలి. మహ్మద్ షమి ఫిట్నెస్ సాధిస్తే పెద్ద సమస్య ఉండదు. బుమ్రా, సిరాజ్, షమి త్రయం అదరగొడుతుంది. కానీ పేస్ విభాగంలో తరం మార్పిడిలో ఉన్న టీమ్ ఇండియా.. ప్రత్యామ్నాయాలను సైతం వెతుక్కొవాల్సి ఉంది. అందుబాటులో ఉన్న బ్యాకప్ పేసర్లకు భారత్-ఏ సిరీస్ తరఫున ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి. భారత సీనియర్ జట్టు నెట్స్‌లో తరచుగా బంతులు వేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టు క్రికెట్లో బంతి అందిస్తే.. సెంచూరియన్ ఫలితాలే పునరావతం అవుతాయి.