అదీ సంగతి!
సుందర్ : ఎప్పుడూ ఈగలు తోలుకుంటూ నిర్మానుష్యంగా ఉండే ఆస్పత్రి ఇవాళ పేషెంట్లు, అటెండర్లతో బిజీ బిజీగా కళకళలాడిపోతుందేంటి?
డాక్టర్ : కొత్తగా ఇద్దరు లేడీ డాక్టర్లను, పది మంది నర్సులను ఎపాయింట్‌మెంట్ చేశా.
అసలు విషయం
చింటు : నాన్నా.. అమ్మ నన్ను కొట్టింది..!
తండ్రి : ఎందుకు కొట్టిందిరా?
చింటు : మరేమో… అగ్గిపుల్ల వేస్ట్ చేశానని కొట్టింది డాడీ.
తండ్రి : ఆ మాత్రం దానికే కొట్టిందా.. నేను నమ్మను.
చింటు : మరి ఆ అగ్గిపుల్ల గీచి పరుపుమీద పెట్టానుగా.
కిటుకు
చిన్న: రాజేష్! మీ ఆవిడ నీ ముందు ఎప్పుడూ తల వంచుకుని కూర్చుంటుంది ఎందుకు?
రాజేష్ : తల వంచుకుంటే 20 ఏళ్ల అమ్మాయిలా వుంటావనీ, తల ఎత్తితే 60 ఏళ్ల వృద్దురాలిలా వుంటావన్నాను.
సీటు మారిస్తే…
అటెండర్ : సార్ సార్.. మన టైపిస్టు పొద్దస్తమానం జోగుతూ.. క్లర్క్ మీద వాలుతూ నిద్రపోతోంది..!
మేనేజర్ : అలాగా.. రేపట్నుంచి నా సీటు క్లర్క్ సీటు పక్కకు మార్చేరు.
పెళ్ళి – ఉద్యోగం
ప్రేయసి : పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు డియర్
ప్రియుడు : ఉద్యోగం రాగానే
ప్రేయసి : మరి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది..?
ప్రియుడు : ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికినప్పుడు..!
ఇంకెందుకు దండగ!
ఇంటర్య్వూ అధికారి : ఏవయ్యా.. సూర్యుడు భూమికి అంత దూరంలో ఎందుకు ఉన్నాడు..?
కాండిడేట్ : పై నున్న సూర్యుడు భూమికి దగ్గరగా రావలసిన పనిలేదనుకుంటాను సార్..!
ఎవరి చుట్టం?
భర్త : (అటుగా వచ్చిన రెండు గాడిదలను చూపించి) ఏమేవ్… మీ చుట్టాలు వచ్చారు.
భార్య : అవునా అండీ! అయ్యో.. రండి మావయ్యగారూ, రండి అత్తయ్యగారూ. ప్రయాణం బాగా జరిగిందా?
డాక్టర్ సలహా
పేషెంట్ : డాక్టరు గారూ… నాకు దగ్గరగా వున్న వస్తువులు కనబడటంలేదండీ.
డాక్టర్ : ఓస్… ఈమాత్రం దానికే ఇంత భయమెందుకు? వస్తువులను దూరంగా పెట్టుకుని చూడండి.
భార్య విలువ
శేఖర్ : చాలా కష్టపడి నా భార్యను కాపాడారు డాక్టర్. మీకు ఫీజు ఎంత ఇమ్మంటారు?
డాక్టర్ : మీ దృష్టిలో మీ భార్య విలువ ఎంతైతే అంతివ్వండి.
శేఖర్ : ఐతే ఇదిగో ఈ పావలా వుంచండి.
దురద పెడుతుందని
టీచర్ : ఏరా రవీ, నిన్న కంద పద్యం చెప్పాను కదా, కంఠతా పట్టావా?
రవి : లేదు టీచర్
టీచర్ : ఏం, ఎందుకనీ
రవి : నోరు దురద పెడుతుందని భయమేసిందండి.