ఖేల్‌ రత్న, అర్జున అవార్డులు వెనక్కి…

Khel Ratna, Arjuna awards back...– ప్రధాని మోడీకి ఇచ్చేందుకు బయలుదేరిన రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌
– మార్గమధ్యంలో అడ్డుకున్న పోలీసులు
– రోడ్డుపైనే బైఠాయించిన పోగట్‌, రెజ్లర్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వంపై రెజ్లింగ్‌ క్రీడాకారులు తమ నిరసనను తీవ్రం చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన మరింత బలపడుతున్నది. నిరసనలో భాగంగా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ ఖేల్‌ రత్న, అర్జున అవార్డులతో ప్రధానమంత్రి కార్యాలయానికి బయలుదేరిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కర్తవ్య పథ్‌ వద్ద నిరసన తెలిపారు. కొద్ది రోజుల క్రితం ప్రధానికి రాసిన లేఖలో వినేష్‌ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యను ప్రస్తావించారు. ఖేల్‌ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని కూడా లేఖలో రాశారు. ఈ లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించకపోవడంతో రెజ్లర్లు తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.
హౌం మంత్రి అమిత్‌ షా, క్రీడా మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి బ్రిజ్‌భూషణ్‌ అనుయాయుడు సంజరు కుమార్‌ సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ తన రెజ్లింగ్‌కు రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టిన సాక్షి.. దేశం కోసం పోరాడుతున్నప్పుడు తాను వేసుకున్న నీలిరంగు బూట్లను టేబుల్‌పైకి లేపి ప్రకటన చేసింది. రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాను క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా బ్రిజ్‌ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధంగా లేదు. ఆ తరువాత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా పద్మశ్రీని, వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ పతకాన్ని తిరిగి ఇస్తారని ప్రకటించగా.. వినేష్‌ ఫోగట్‌ కూడా ఈ అవార్డును వెనక్కి ఇచ్చారు.