బ్యాంకుల్లో కానరని డిపాజిట్‌దారులు
హైదరాబాద్ : రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ విదివిధానాలకు అనుగుణంగా బ్యాంక్‌లు పెద్ద నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేశాయి. తొలి రోజు బ్యాంక్ శాఖల్లో ఎక్కడా కూడా రూ.2,000 నోట్ల డిపాజిట్ల హడావుడి పెద్దగా లేదని ఆ వర్గాలు తెలిపాయి. పెద్ద నోట్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బిఐ గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఆర్‌బిఐ ఇప్పటికే బ్యాంకులకు విదివిధానాలను జారీ చేసింది. సాధారణ జనం వద్ద పెద్దగా రూ.2వేల నోట్లు లేకపోవడం వల్లనే ఎక్కడ కూడా జనం బారులు తీరిన ఘటనలు కానరాలేదు. బ్యాంక్ శాఖలు యథాతథంగా పని చేశాయి. ఎలాంటి గుర్తింపు పత్రం లేకుండా రూ.20,000 వరకు రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవడానికి ఆర్‌బిఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. నోట్ల మార్పిడికి నాలుగు నెలల సమయం ఉన్నందున, చెలామణిలో ఉన్న కరెన్సీ కూడా నోట్ల రద్దుతో పోల్చితే చాలా తక్కువ అని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల్లో మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం అందుబాటులో ఉందని.. ప్రజలు భయాందోళన చెందవద్దని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. 2016 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ హడావుడిగా రాత్రికి రాత్రే రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటు కావని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో జనం తమ అత్యవసరాల నిధుల కోసం బ్యాంక్‌ల వద్ద బారులు తీరి తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా.. ఈ దఫా అలాకాకుండా రూ.2,000 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 వరకు పెద్ద నోటు చలామణీలో ఉంటుందని.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశంలోని మొత్తం కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా ప్రస్తుతం 10 శాతంగా ఉందని అంచనా. అది కూడా కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, కాంట్రాక్టర్ల దగ్గర పోగు పడిందనే అరోపణలు ఉన్నాయి. బడా వర్గాలకు 2016 నాటి నోట్ల రద్దు తరహా విధానాన్ని అమలు చేయకుండా.. నాలుగేసి మాసాల సమయం ఇవ్వడం ద్వారా వారి సొమ్మును లీగల్‌గా మార్చుకోవడానికి వీలు కల్పించారనే విమర్శలు పెరుగుతున్నాయి. సామాన్యుడికి ఓ న్యాయం.. బడా బాబులకు మరో న్యాయాన్ని అవలంభిస్తున్నట్లుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ పెద్ద నోట్లు ఉన్న కొద్ది మంది సామాన్య ప్రజలు నిత్యావసరాలు, ఇంధనం ఇతర వాటికి ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.