నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పేదలకు సొంత ఇంటి కల నెరవేరే వరకూ భూ పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈటీ నర్సింహ, కార్యవర్గ సభ్యుడు ఆందోజ్ రవీంద్రా చారి, కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డిలు అన్నారు. భూ పోరాటం చేపట్టి బుధవారం నాటికి 120 రోజులు కాగా… ఈ సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. అనంతరం వారు వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్ రావి నారాయణరెడ్డి కాలనీ పేస్ త్రీలో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ భూ పోరాటం పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేవరకూ ఉద్యమాన్ని మరింత ఉదతం చేస్తామని అన్నారు. దశాబ్దాలుగా ఇండ్లు లేని పేదలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 120 రోజులుగా (నాలుగు నెలలు) పిల్లాపాపలతో ఇక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన సేవాదళ్ వాలంటీర్లు 24 గంటలూ గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు రక్షణ కల్పిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ మండల కార్యదర్శి శేఖర్ రెడ్డి, పెద్ద అంబర్ పేట మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్ నాయక్, సీపీఐ నాయకులు నరసింహ, వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.