కొంత కాలం అట్లనే ఉంటది
ఇల్లు ఖాళీ చేస్తున్నంత ఫీలింగ్
ఈ శరీరమే అద్దె కొంపనుకున్నామా
మనలో ఏ ప్రకంపనలు ఉండవు!
అట్లెట్లా కుదురుతుందనుకుంటేనే
ఖాళీ చేయడం పెద్ద సమస్యైపోతది
అలవాటు పడేదాకనే నిర్వాసిత
అసౌకర్యమొకటి వెంటాడుతది
కాలం చేసే వైద్యం
ఏ కేర్ హాస్పిటల్ చేయలేదు
వసంతం విస్తరించినప్పుడు
గట్టిగా ఈలలు వేసి ఉండవచ్చు
ఉన్మత్త కాలంలో తన్మయత్వంతో
గొంతెత్తి గానం చేసి ఉండవచ్చు
అట్లని వైభవాలు శాశ్వతమనుకోరాదు!
ఆకురాలు కాలం దాపురించినప్పుడు
చెట్టులా మనిషి కూడా
ధ్యానంలోకి జారిపోవాలి!
జ్ఞానోదయమూ సూర్యోదయం వంటిదే
నిర్ణీత కాలానికి విరగ్గాస్తుంది!
అతథిలాగ వచ్చిన వారికి తెలుసు
ఈ సౌకర్యాలు శాశ్వతం కావని
గెలుపు ఎంత పెద్దదైనా
నిద్రపుచ్చే లాలి పాటనే
ఓటమిని జీర్ణించుకున్నమా
గెలుపు మార్గాలు వేయి తోస్తాయి!
కొన్ని బాధలు మంచివే
లోపలికి చూసుకునే వీలు కల్పిస్తాయి!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261