కాలధర్మం…

కాలధర్మం...భద్రంగా దాచుకున్న బ్రతుకు పాయసం
చేదుగా ఒలికిపోయేదొక్కసారే
నిలబడి కలబడే యుద్ధాలే
పదే పదే తారస పడతాయి

గుత్తులు గుత్తులుగా పూచిన గుల్‌ మోహార్‌ పూలు
అత్యంత సహజంగా ప్రకతి ధర్మంగా
నేలరాలి పోయినట్టు

మన నుంచి విస్తతంగా విస్ఫోటనమవుతున్న
భావాలు… బాంధవ్యాలూ..బాధ్యతలూ
ఒకానొక కాలంలో అసంకల్పితంగానే
స్థాన చలనమై పోతుంటాయి
ఎంతో ఆత్మీయంగా
గుండె కండెకు చుట్టుకున్న దారాలన్నీ
చిక్కుముళ్లను విప్పుకొని
అలవోకగానే నిన్ను విదిల్చు కుంటాయి

ప్రయాణ మెప్పుడూ
సాఫీగానే సాగుతుందని తలంచకు
నువ్వు వెళ్ళే దారి విచ్చుకత్తుల వలయం కావచ్చు
పథ్వీతలం నీ తలంపుతో తరుచూ ఏకీభవించదు

జీవన కుడ్యాలపై ఏర్పడ్డ బాధాప్త చిత్రాలతో
నీ కన్నులు జలార్ధ్రమై పోవచ్చు
అనేకానేక వైరుధ్యాలను ధరించిన దశ్యాలన్నీ
హాఠాత్తుగా మసక బారుతాయి

కంటక వత్తాల మధ్య కదలాడటం
పాతాళ బిలంలోకి నేట్టివేయ బడటం
రెండూ ఒక్కటే…
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే
ద్ణుఖాల ప్రసక్తే ఉండదు కదా…
ఈ ఉన్మత్త క్షేత్రంలో
కష్ట సుఖాలు బొమ్మా బొరుసులే

ఓ స్ఫురద్రూపీ…
కాలధర్మం తిరగేసి రాసుకునే చిత్తుప్రతి కాదు
నిషిద్ధాక్షరాలు అందులో వుండవు కాక వుండవు
అన్నింటినీ చదివేస్తూ…
అంతిమంగా ప్రస్థానం కాక తప్పదు.
– డా||కటుకోఝ్వల రమేష్‌, 9949083327