కవిత్వ పరిమళం ముకుందరామారావు

The perfume of poetry is Mukundarama Raoముకుంద రామారావు గారితో నా అనుబంధం 20 ఏళ్ల నాటిది. నేను హైదరాబాద్‌ వెళ్ళిన కొత్తలో ఒకరోజు కె.పి.అశోక్‌ గారు ‘ముకుంద రామారావు నిన్ను అడిగినాడబ్బా, నిన్ను కలవాలి అంటున్నాడబ్బా’ అన్నాడు. నేను ఎట్లా తెలుసు ఆయనకు అన్నాను. ‘అరే గదేంది వై ఆయనకు తెల్వక పోవుడేంది, ఇంతకుముందు కూడా ఆయన నీ గురించి మాట్లాడుతుండే’ అన్నాడు కేపీ. ఆ తరువాత ఒక సభలో కలిశాను ముకుంద రామారావుగారిని. అప్పటినుండి మెల్లగా ప్రారంభమైన మా అనుబంధం ఇప్పుడు 10, 15 రోజులకు ఒకసారి అయినా పలకరించుకోవడం పరిపాటిగా మారే స్థితికి వచ్చింది.
ముకుంద రామారావుగారి పలకరింపు ఎంత ఆత్మీయంగా ఉంటుందో ఆయన కవిత్వపు పలకరింపు అంతకన్నా ఆత్మీయంగా ఉంటుంది. ‘వలస పోయిన మందహాసం’ నుంచి ఇటీవలి కవితా సంపుటి ‘రాత్రి నదిలో ఒంటరిగా’ వరకు అన్ని కవితా సంపుటులు, మెత్తమెత్తటి మాటలతో సున్నిత హదయాలను అతి సున్నితంగా తాకే, లేలేత కవిత కిరణాలు మనలను హత్తుకుంటాయి.
”నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి/ నాకే వీడ్కోలిస్తున్నప్పుడు/ ఇన్నాళ్లు/ గుండె గదిలో వొదిగి వొదిగి/ కళ్ళకేదో మంచు తెర కప్పి/ చూస్తూ చూస్తూనే/ గువ్వలా ఎగిరిపోయినట్లయింది”
‘వలస పోయిన మందహాసం’ లో మనసును తాకే మాట ఇది. ఒక సుదీర్ఘ విరామం తర్వాత రాసిన మొదటి కవిత ఇది. పెద్దకూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నప్పటి మానసిక భావోద్వేగ స్థితిని తెలిపే కవిత ఇది. ఈ కవిత ఆంధ్రప్రభలో 1993లో ప్రచురితమైంది. 50వ పడికి దగ్గరగా ఉన్నప్పుడు అచ్చయిన ఈ కవిత ఆయనను సాహిత్య ప్రపంచానికి అతి చేరువగా తీసుకొచ్చింది. రచనా వ్యాసాంగం ప్రారంభమైన తొలినాళ్లలో కొన్ని కథలు రాసినప్పటికీ ఆయన దృష్టి మాత్రం కవిత్వం మీదనే నిలిచింది. కవిత్వం రాసేవాడు తప్పనిసరిగా దేశ దేశాల కవిత్వం చదవాలని తనకు తానే నిబంధన పెట్టుకుని ప్రపంచ దేశాల కవిత్వాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించిన ముకుంద రామారావు ఆ కవిత్వంలో తనకు నచ్చిన వాటిని తెలుగు పాఠకులకు అందించాలని భావించడంతో ఆయన దృష్టి అనువాదం వైపుకు మళ్ళింది.
1995లో వెలువడిన ‘వలస పోయిన మందహాసం’ తొలి సంపుటి నుండి ఇప్పటివరకు ఎనిమిది కవితా సంపుటులు, 14 అనువాద కవితా సంపుటులు వెలువరించారు. లేటు వయసులో కవిత్వం రాయడం ప్రారంభించానని తనకు తానే ప్రస్తావించినప్పటికీ ఇంత తక్కువ సమయంలో ఎంత విస్తృతంగా కవిత్వ సృజన చేయడం అనువాదాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. జీవితకాలం సాహిత్య సృజన చేశామని చెప్పుకునే వారు సైతం చేయలేని విధంగా ముకుంద రామారావు సాహిత్య సృజన చేయడం అత్యంత విశేషమైనది.
ముకుంద రామారావు జీవితాన్ని కవిత్వపు కుంచెలతో ఎలా బొమ్మ కట్టిస్తాడో ఈ కవిత చూస్తే అవగతం అవుతుంది
”మహాసముద్రం/ మరో ఇసుకరేణువును కలుపుకున్నట్లు/ గురితప్పని కాలం కొక్కానికి/ వయస్సు చిక్కుకుంటుంది/ అదేటు లాగితే అటు/ జరుగుతూ జరుగుతూ/ పుటుక్కున తెగేవరకు” – కాలం కోక్కానికి చెక్కుతున్న వయస్సు అనే భావ చిత్రాన్ని ఊహించుకోవడం అంటే జీవితపు తాత్విక చిత్రణ మన కళ్ళ ముందు నిలుస్తుంది.
మనుషులతో ఆత్మీయ అనుబంధాల్ని కలుపుకోవడం ముకుంద రామారావుకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం.
మరొకచోట ‘ఒక ఒంటరివేళ’ ను వర్ణిస్తూ ”ఏకాంతంలో/ దూరాలన్నీ నన్ను చుట్టూ ముడతాయి/ నేను నిరాయుధుడిగా మిగులుతాను” అంటాడు. నిజానికి ఏకాంత సమయంలోనే అనేక ఆలోచనలు మనలను చుట్టుముడతాయి. ఆలోచనల్లో ఉక్కిరిబిక్కిరవుతూ వాటిని ఎదుర్కొనే శక్తిని కోల్పోతాడు మనిషి. రంగులు మార్చిన మేఘాలో, నదిని ఇముడ్చుకున్న తీరాలో మనల్ని ఓదారుస్తుంటాయి. కానీ ఒంటరి బాధ తెలియనప్పుడు ఓదార్పు కూడా తెలియదు కదా! అందుకే కవి బాధ తెలిసిన తర్వాతే ఓదార్పు తెలిసింది అంటాడు.
ముందే అనుకున్నట్టు ముకుంద రామారావుకు కుటుంబ సంబంధాల పట్ల, మిత్రుల పట్ల, ఆత్మీయుల పట్ల అమితమైన ప్రేమ. అందుకే ‘విడనిముడి’ పేరుతో తన కవితల్లోని ఆత్మీయ అనుబంధాలు తెలిపే కవితలన్నింటిని ఏర్చి కూర్చి ప్రత్యేకమైన సంపుటిగా తీసుకొచ్చారు. ఇందులో ‘ప్రవహించే నీరు’ కవితలో మట్టిని నమ్మినవాడు భూగోళమంతా ఒకటే మట్టని విశ్వసించి, కష్టాన్ని ఆసరాగా చేసుకుని దూర ప్రాంతాలకు వలస పోయినవాడు, ఎప్పటికీ తిరిగిరాలేని స్థితిని మనసుకు హత్తుకునే విధంగా వర్ణించారు చెరువులో నీరులా ఉండక సమస్తము వదిలి సముద్రాలు దాటిపోవడమెందుకు అంటూ ఒక నిరసన స్వరంతో ప్రారంభించి మట్టిని నమ్మేవాడికి ఏమట్టైనా ఒక్కటేనా భాష రుచి ఏమి అడ్డురావు అంటాడు కానీ చరిత్రకాల గమనంలో ఏ ఏ మానవజాతులు ఎక్కడెక్కడి నుండి ఎటువంటి వెళ్లి స్థిరపడ్డారో లేదు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నారో తెలియంది కాదు కానీ మన పూర్వీకులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసినప్పుడు కలిగిన మానసిక ఆవేదనను ముకుంద రామారావు తన కవిత్వంలో వ్యక్తం చేస్తారు.
సూఫీ కవిత్వ సారాన్ని శతాబ్దాల సూఫీ కవిత్వం పేరుతో తెలుగువారికి అందించారు. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే 10వ శతాబ్దం నాటి మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలైన చర్యా పదాలను తెలుగులోకి అనువదించడం. దాదాపుగా అనేక భాషలకు ప్రథమ కావ్యంగా చెప్పుకునే ఈ చర్యా పదాల ద్వారా సాంధ్యభాషలో దాగి ఉన్న మహాయాన బౌద్ధ సిద్ధాచార్యుల ఉపదేశాలను మనకు అందివ్వడం ముకుంద రామారావు గారి అనువాద సజనకు మరో మైలురాయి లాంటిది అనిపిస్తుంది. అంతేకాకుండా నోబెల్‌ బహుమతి పొందిన కవులందరిని వారి జీవిత విశేషాలతో సహా తెలుగు పాఠకులకు అందించారు. ఇటువంటి కవి నాకు మిత్రుడని చెప్పుకోవడం అంటే ఆయన ఒంటికి అంటిన కవిత్వ పరిమళాలని ఒకసారి ఆయనను కౌగిలించుకోవడం ద్వారా నాకు అంటించుకోవాలని ప్రయత్నించడమే. నిరంతరం కవిగా మసలుతున్న ముకుంద రామారావును గూర్చి రాసే ఈ వ్యాసాన్ని ఆయన మాటల్లోనే ముగిస్తాను.” నా దృష్టిలో కవి నిత్య విద్యార్థి కవిత్వానికి చదువు వయస్సు కొంతవరకు ఒక ఉపయోగపడతాయేమో కానీ అవే ముఖ్యం కాదని నమ్ముతాను నేర్చుకోవాల్సింది అందరిలోనూ ఉంటుంది అన్నింట ఉంటుంది నేర్చుకోవాలన్న తపన ఎప్పుడో ఎక్కడో ఆగిపోవాల్సింది కాదనుకుంటాను కవిత్వ వాతావరణం ఆసక్తికి మరింత దోహదపడుతుంది ఉపయోగపడుతుందనుకుంటాను”.
(ముకుందరామారావు జనవరి 7న అజోవిభో కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)
– బండ్ల మాధవరావు, 8897623332