విశాఖ: విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏండ్ల బాలికపై పది మంది యువకులు లైంగికదాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం… ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంటోంది. ఆ కుటుంబంలోని బాలిక తన ప్రియుడిని కలిసేందుకు విశాఖ నగరంలోని ఓ లాడ్జికి డిసెంబర్ 17న ఉదయం వెళ్లింది. అక్కడ ఆమెపై ప్రియుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అతను స్నేహితునికి సమాచారం ఇచ్చాడు. అతనూ లాడ్జీకి వచ్చి బెదిరించి బాలికపై లైంగికదాడి చేశాడు.ఈ సంఘటనతో భయాందోళనకు గురైన యువతి విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఏడుస్తూ ఉండగా ఓ ఫొటోగ్రాఫర్ చూశాడు. ఆమెను ఓదార్చి, మాయమాటలు చెప్పి తన స్నేహితుల గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించి అతని స్నేహితులు దారుణానికి దిగారు.