– నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతాం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
– జెండాను ఆవిష్కరించిన అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థి పోరాటాల వారధి, త్యాగాల రథసారధి ఎస్‌ఎఫ్‌ఐ అని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి అన్నారు. నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆర్‌ఎల్ మూర్తి ఎగురవేశారు. జాతీయోద్యమ వీరుడు భగత్ సింగ్ చిత్రపటానికి పూలదండలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరికీ విద్య, ఉపాధి కల్పించాలనీ, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో ఎస్‌ఎఫ్‌ఐ కేరళలో ఆవిర్భవించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు రాజ్యాంగ రక్షణ, విద్యారంగంలో సమాన విద్యావకాశాలు, అందరికీ చదువు, చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలనే పోరాటాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నరు. ఎస్‌ఎఫ్‌ఐ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిందనీ, విద్యార్థి హక్కుల కోసం నినదించిందని తెలిపారు. విద్యా ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ, కాషాయికరణ వ్యతిరేకంగా తమ సంఘం నికరంగా పోరాడుతోందన్నారు. బీజేపీ తన మాతసంస్థ ఆరెస్సెస్ ఎజెండాను విద్యారంగంలో అమలు చేయాలని కుట్ర చేస్తోందనీ, అందులో భాగంగానే సిలబస్‌లో మార్పులు చేస్తూ జాతీయోద్యమ వీరుల చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగిస్తున్నదని విమర్శించారు. మూఢవిశ్వాసాలను జొప్పిస్తోందన్నారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రభుత్వ విద్యారంగంలో కార్పొరేట్‌శక్తులను, విదేశీయూనివర్శీటీలను తీసుకుని వచ్చి దేశ విద్యారంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని విమర్శించారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమలు కోసం పోరాడాలన్నారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, అధ్యక్షులు కోటరమేశ్ మాట్లాడుతూ..బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులను తీసేస్తున్న తీరును వివరించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందనీ, చదివే చదువులు, చేసే ఉద్యోగాలకు పొంతన లేకుండా పోతున్నదన్నారు. భవిష్యత్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఐక్యంగా పోరాటాలు చేస్తామన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక విద్యార్ధి ఉద్యమాలు నడిపిన ఘనమైన చరిత్ర ఎస్‌ఎఫ్‌ఐకి ఉందనీ, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జునుగరి రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.మమత, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చిన లెనిన్, రమ్య, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్, నాగేందర్, నాయకులు సాయి, సలీం, అజరు తదితరులు పాల్గొన్నారు.