– నేడే నింగిలోకి ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం
– అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్
– ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగం
– ఇప్పటికే కౌంట్ డౌన్ షురూ
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరొక్క ప్రయోగానికి సిద్ధమవుతున్నది. కొత్త సంవత్సరంలో కొత్త ప్రయోగాన్ని చేపడుతున్నది. చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచి, సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ అంతరిక్ష పరిశోధనల్లో తన పేరును నిలబెట్టుకున్నది. ఇప్పుడు 2024 ఏడాదిలో తొలి ప్రయోగానికి తయారవుతున్నది. నేడు ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను నింగిలోకి పంపనున్నది. పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ దీనిని అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నది. దాంతోపాటు మరో 10 పేలోడ్‌లను నింగిలోకి తీసుకెళ్లనున్నది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టన్నుది. ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కౌంట్‌డౌన్‌ను షురూ చేసింది. ఆదివారం ఉదయం 8.10 గంటలకే కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఇది సోమవారం ఉదయం 9.10 గంటల వరకు కొనసాగనున్నది. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం.. భారత్ అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానున్నదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్,, టైం డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన గత ప్రయోగాల లాగా కాకుండా.. ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌రే మూలాలను అన్వేషించటం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని చెప్పారు. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవితకాలం ఐదేండ్లని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నదని అంతరిక్ష పరిశోధకులు అంటున్నారు.