రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థుల మృతి

 Two students died in a road accident– స్కూటీపై వెళ్తూ డివైడర్‌ను ఢ కొట్టిన విద్యార్థులు
– మరో విద్యార్థికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
– సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ విద్యార్థులుగా గుర్తింపు
నవతెలంగాణ – పటాన్‌ చెరు
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు హాస్టల్‌ నుంచి బయటికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్ధులు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఆర్‌.భరత్‌ చందర్‌(19), బచ్చన్నపేటకు చెందిన పి.నితిన్‌(19), ఖమ్మంకు చెందిన ఏ. వంశీ (19) సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో బీటెక్‌ (ఈసీ) సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నారు. అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. నూతన సంవత్సరం వేళ ఆదివారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులు ఔట్‌పాస్‌ తీసుకొని జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వచ్చారు. అక్కడ మరో ఆరుగురు విద్యార్థులు కలవగా అందరూ కలిసి మూడు ద్విచక్ర వాహనాల్లో హైదరాబాద్‌లోని దుర్గం చెరువు చూసేందుకు వెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో అక్కడికి చేరుకోగా.. దుర్గం చెరువు పైకి అనుమతి లేకపోవడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై కొంతసేపు కాలక్షేపం చేశారు. అనంతరం సంగారెడ్డికి వెళుతున్న సమయంలో తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నవి ఏమీ కనిపించక.. వాహనం అదుపుతప్పి పటాన్‌చెరు శివారులోని వాల్యూమ్‌ మార్ట్‌ ఎదురుగా జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢకొీట్టింది. దాంతో స్కూటీ పైనుంచి ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్‌పై మధ్యలో కూర్చున్న నితిన్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. భైక్‌ నడుపుతున్న భరత్‌ చందర్‌తో పాటు వంశీకి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి భరత్‌ చందర్‌ మృతి చెందారు. వంశీని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న విద్యార్ధుల కుటుంబీకులు బోరున విలపించారు. చేతి అందొచ్చిన కొడుకులు అర్ధాంతరంగా మృతి చెందడంతో మాకు దిక్కు ఎవరంటూ వారు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడు నితిన్‌ అన్నయ్య మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.