అయోధ్యలో మాంసం.. మందు నిషేధం

Ban on meat and drugs in Ayodhya– వేలాది మంది జీవనోపాధికి దెబ్బ
– పూట గడవక అవస్థలు
– యోగి సర్కారు తీరుపై ఆందోళన
చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు
లక్నో : యూపీలోని అయోధ్య కేంద్రంగా కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఆధ్యాత్మికత పేరుతో రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయి. అయోధ్యలో మాంసం, మందును ఇటీవల నిషేధించింది. దీంతో వీటి మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది జీవనోపాధిపై దెబ్బ పడింది. ముస్లిం, హిందూ, కులమనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగి సర్కారు నిర్ణయంతో తిప్పలు పడుతున్నారు. ‘ఈ ఏడాది బీజేపీకి చాలా ముఖ్యమైంది. ఈ నెలలో అయోధ్య రామ మందిర ప్రారంభం, విగ్రహ ప్రతిష్టాపన వంటివి ఉన్నాయి. అలాగే, లోక్‌సభ ఎన్నికలూ కొన్ని నెలల్లో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సి ఉన్నది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఎక్కడా లేని ఏర్పాట్లు, ఆంక్షలు అయోధ్యలో కనిపిస్తున్నాయి’ అని అక్కడి స్థానికులు కొందరు అంటున్నారు. అయోధ్యలోని రామమందిరంలోని 84 కోస్‌ పరిక్రమ మార్గ్‌లో మాంసం విక్రయాన్ని నిషేధిస్తూ యోగి సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఇది తమ జీవనోపాధిపై దెబ్బ కొడుతున్నదని ఇక్కడి స్థానికులు, మాంసం, మద్యం అమ్మకందార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ’10 సంవత్సరాలుగా మేవాటిపురాలో చికెన్‌ దుకాణం నడుపుతున్నాం. ఆకస్మికంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించడంతో మాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకంటే నా పిల్లల చదువుల కోసం చెల్లించే ఏకైక ఆదాయం ఇదే’ అని సద్దాం అనే వ్యక్తి వాపోయాడు.
నగరంలోని మాంసం విక్రయదారుల యూనియన్‌ తంజిముల్‌ ఖురైష్‌ కార్యదర్శి దస్తగిర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ‘ఈ వ్యాపారంలో కనీసం 90 శాతం మంది ముస్లింలు ఉన్నారు. మాంసాన్ని తినే వారిలో 90 శాతం మంది హిందువులు ఉన్నారు. కాబట్టి, ప్రభుత్వ నిర్ణయం రెండు వర్గాలకూ నష్టం. ఈ వ్యాపారం మీద ఆధారపడినవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు’ అని అన్నారు. తంజిముల్‌ ఖురైష్‌ సభ్యుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మాట్లాడుతూ.. ‘నేను సీఆర్పీఎఫ్‌ క్యాంపు, ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కిలోల చికెన్‌, మటన్‌ సరఫరా చేస్తాను. అయితే అయోధ్యలో మాంసాన్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నిరాశ చెందాను’ అని తెలిపాడు. మద్యం, మాంసం అమ్మకాలపై ప్రత్యక్షంగా జీవనం సాగించేవారు మాత్రమే కాకుండా పరోక్షంగా వీటిపై ఆధారపడేవారూ నష్టపోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాజకీయాలను వదిలి.. తమ లాంటి వారిపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని గమనించాలని ఇక్కడి బాధితులు కోరుతున్నారు.