అడవికి ముప్పు

A threat to the forestజార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో దామోదర్‌ నది ఒడ్డున ఉన్న వేలాది ఎకరాల్లో 20 ఏండ్ల నుండి బొగ్గు తవ్వ కాలు జరుగుతున్నాయి. అప్పటి నుండి వారి ఇళ్లలో నిత్యం నిల్వ వుండే గోధుమలు, వరి మాయమయ్యాయి. వాటి స్థానంలో నల్లగా మసిబారిన బతుకులు కనిపిస్తాయి. తవ్వ కాల కోసం భూములు లాక్కున్నారు కానీ అక్కడి యువతకు ఉద్యోగాలివ్వలేదు. ఒకప్పుడు పంటలు పండించిన ఆ ప్రదే శంలోనే వారి బిడ్డలు ఇప్పుడు బొగ్గు తీసే పనికి పోతు న్నారు. సరిగ్గా ఇదే దుస్థితి అతి త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో పున రావృతం కాబోతున్నది.
అడవిని నాశనం చేస్తున్నామంటే మన వినాశనాన్ని మ నమే కోరుకున్నట్టు. అయినా విలువన్నీ కుర్చీల్లోనే చూసు కుని మురిసే వారికి అడవి విలువ, ప్రకృతి ప్రాధాన్యం ఎలా తెలుస్తుంది? అడవంటే గిరిజనుల బతుకు. అందులోని ప్రతి అణువూ వారి సొంతం. అయితే చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకుని వారికి దక్కాల్సిన భూములను ప్రభుత్వ అండతో కార్పొరేట్లు అప్పనంగా మింగేస్తున్నారు. దీనికి నిదర్శనమే ఛత్తీస్‌గఢ్‌్‌ తాజా ఉదంతం.
ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవి భూములను అదానీ గ్రూప్‌ మింగేయాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సుమారు మూడువందల డెబ్భై కోట్ల బొగ్గు నిక్షేపాలను స్వాహా చేయాలని ప్రధాని ప్రాణ మిత్రుని గ్రూపు గోతికాడి నక్కలా కాచుక్కుచ్చుంది. ఇంకేముంది మన రాజా వారు వెంటనే అడవుల అక్రమ నరికివేతకు రం గం సిద్ధం చేశారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకున్న పర్యావరణ వేత్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారు. అమాయక ఆది వాసీల నోరు నొక్కేందుకు వారి గొంతుకైన నాయకులను నిర్భంధించారు. ఆ రాష్ట్ర తొలి గిరిజన ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ నాయకత్వంలోనే ఇదంతా జరగడం మరింత దారు ణం. దీనిపై ప్రశ్నిస్తే ‘గతంలో పాలించిన కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రారంభించిన నరికివేతనే ఇప్పుడు మేం కొనసాగి స్తున్నాం’ అంటూ సెలవిచ్చారు. తమ నాశనాన్ని కోరుకునే పాలకులు ఎవరైనా ప్రజలు కచ్చితంగా నిలదీస్తారని పాల కులు గుర్తించాలి.
అక్కడి ఆదివాసీ నాయకుల లెక్కల ప్రకారం 2022లో నలభై ఒక్క హెక్టార్ల విస్తీర్ణల్లో ఉన్న చెట్లను నరికివేశారు. 2023 నవంబర్‌లో తొంబ్భై మూడు హెక్టార్ల అడవి విధ్వం సం చేసేందుకు అనుమతి పొందారు. అందులో భాగం గానే నరికివేత పనులు ప్రారంభించారు. ఒక్క ఈ రాష్ట్రం లోనేకాదు దేశంలోని అనేక చోట్ల అక్రమ నరికివేతలు, తవ్వ కాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గనుల తవ్వకం ము ఖ్యంగా ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ అడవి బిడ్డలను భూమికి దూరం చెయ్యడమే కాదు అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్ప త్తి చేస్తుంది. నేల నాణ్యతను క్షీణింపజేస్తుంది.
ఇక మన రాష్ట్రంలో కూడా ఇలాంటి అక్రమాలు జరుగు తూనే ఉన్నాయి. పచ్చని అడవిని కొల్లగొట్టే దందాలు యథే చ్ఛగా సాగుతూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని అనేక ప్రాంతాల్లో సుమారు 7వేల ఎకరాల అటవీ విస్తీర్ణం ఉండేది. పచ్చని వనాలతో అహ్లాదకరంగా ఉండే ఈ అటవీ ప్రాంతం ఆక్రమణదారుల చేతిలో కరిగి పోయి కేవలం మూడువేల ఎకరాలు మాత్రమే మిగిలింది. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో గ్రావెల్‌ మాఫియా బరితెగించింది. ఇటీవలే వేల కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను తవ్వి తరలించుకుపోతున్న మాఫియాపై ఫిర్యాదులు వెల్లువె త్తాయి. విజయవాడ శివారులోని అనేక గ్రామాల్లో వెయ్యి కోట్ల వరకు అక్రమాలు జరిగాయని సమాచారం.
అడవులను, గ్రామాలను నిర్వీర్యం చేసేందుకు ఇన్ని దుర్మార్గాలు జరగుతుంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పైగా దేశంలోని 7,08,273 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రాంతాన్ని రక్షించే పేరుతో అటవీ శాఖ అధి కారులకు అపరితమైన అధికారాలు కట్టబెట్టడానికి ప్రయ త్నించారు. దాని కోసమే మోడీ నాయకత్వంలో 2019లో భారత అటవీ చట్టం ముసాయిదా సిద్ధం చేశారు. ఉదార వాద ఆర్థిక విధానాలకు అనుగుణంగా అటవీ సంపదను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఇందులో చేర్చారు. ఈ బిల్లు 2006 నాటి అటవీ హక్కుల చట్టంలోని కొన్ని అంశాలను ఉల్లంఘించేట్టు ఉ న్నాయి. ఫలితంగా ఆక్రమణలకు గురైన భూమి 1.3 మిలి యన్‌ హెక్టార్లకు పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబు తున్నాయి. ఈ లెక్కలు పరిశీలిస్తే అడవుల ఆక్రమణ బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిషా, జార్ఖాండ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రా ల్లోనే ఎక్కువని స్పష్టంగా తెలుస్తోంది.
అదే సమయంలో ప్రధాని అడవుల పెంప కం కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రకటిం చారు. 2030 నాటికి క్షీణించిన భూమిని 21 మిలియన్‌ హెక్టార్ల నుండి 26 మిలియన్‌ హెక్టా ర్లకు పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి సమా వేశంలో అద్భుతంగా ప్రసంగించారు. కానీ దేశం లో పరిస్థితి చూస్తే దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ‘దోచుకునేటోడికి దోచుకున్నంత’ అన్నట్టుగా మా రిపోయింది. ప్రధాని మాటలకు, చేతలకు పొం తన ఉండదని మరోసారి రుజువయింది. ఇటు వంటి పరిస్థితుల్లో అడవులను కాపాడుకునే బా ధ్యత కేవలం అడవి బిడ్డలదే అనుకుంటే పొరపాటు. అడ వులు అంతరించిపోతే గిరిపుత్రులకే కాదు పర్యా వరణానికే పెను ప్రమాదం. మానవ మనుగడే కష్టం. కాబట్టి దేశం లోని విస్తారమైన అడవులను కార్పొరేట్లకు కట్టబెడుతున్న పా ల కులను నిలదీయాల్సిన అవసరం ప్రతి పౌరుడికీ ఉంది.