– కేసీఆర్ ప్రభుత్వ అతిపెద్ద స్కాం కాళేశ్వరం
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటి కాదని నిరూపించుకోవాలి
– ఎంఐఎం మధ్యవర్తిత్వంలో తాజా, మాజీ సీఎంల లోపాయికారి ఒప్పందం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎస్‌ఎల్వీ-సీ58ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 2024 గగన్‌యాన్ సంవత్సరంగా నిలవబోతున్నదని ఆకాంక్షించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టు అని అరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టుపై విచారణ చేయిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు చప్పుడు చేయడం లేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో సీబీఐ విచారణ చేయించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటి కాదని నిరూపించుకోవాలని సూచించారు. తుమ్మితే ఊడిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వముందనీ, అందుకే బీఆర్‌ఎస్‌కు మేలు చేసేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
రెండు పార్టీల మధ్య విభేదాలొద్దనే ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాళేశ్వరం ద్వారా గోదాట్లో కలిపిందని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఆధ్వర్యంలో హైలెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్లు కుంగిన ఘటనపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిందన్నారు. 20 అంశాలపై ఆ కమిటీ వివరాలను అడిగితే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 11 అంశాలపైనే అరకొర సమాధానాలిచ్చిందని విమర్శించారు. అవినీతితో విడదీయరాని బంధమున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ స్కామ్‌ల పట్ల సానుభూతి చూపుతున్నదని ఆరోపించారు. సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే 48 గంటల్లో దర్యాప్తును ప్రారంభిస్తుందని హామీనిచ్చారు.