రాయదుర్గం – ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఆపండి…

Rayadurgam - Airport Metro Stop...– పాతబస్తీకి విస్తరణ చేపట్టండి : సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డీపీఆర్‌తో పాటు ట్రాఫిక్‌ అధ్యయనాలను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని ఆదేశించారు. మెట్రో విస్తరణపై సీఎం ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌, మియాపూర్‌-పటాన్‌చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఎంజీబీఎస్‌-ఎయిర్‌పోర్టు, నాగోల్‌- రాజేంద్రనగర్‌ మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు. అక్కడి మార్గాల్లో 103 మత పరమైన, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎమ్‌డీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ దారుల్‌షిఫా నుంచి ఫలక్‌నుమా జంక్షన్‌ వరకు 100 అడుగుల రోడ్డు కోసం పరిశీలించాలని సూచించారు. ఒఆర్‌ఆర్‌ అందుబాటులో ఉన్నందున గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు తలపెట్టిన 31 కిలోమీటర్ల మేర మెట్రో (రూ.6,250 కోట్లు)ను పక్కన పెట్టేయాలని తెలిపారు. దానికి బదులుగా ఎంజీబీఎస్‌ నుంచి పాతనగరం మీదుగా, అదే విధంగా ఎల్‌బీ నగర్‌ నుంచి ఎయిర్‌ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఇచ్చే దానిపై దృష్టి సారించాలని కోరారు. అదే విధంగా నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌.బీ.నగర్‌ మెట్రో స్టేషన్‌కు విస్తరించటం ద్వారా 5 కిలోమీటర్ల గ్యాప్‌ ను పూరించాలన్నారు. లక్ష్మీగూడ- జల్‌ పల్లి -మామిడిపల్లి మధ్య కొత్త మెట్రో మార్గానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. మెట్రోకు కేటాయించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రితో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ను ఆదేశించారు.
సమావేశంలో వచ్చిన అంశాల ఆధారంగా కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ కోసం లేఖను సిద్ధం చేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీలను ఆదేశించారు. ఎయిర్‌ పోర్ట్‌ ఏరియా నుంచి కందుకూరుకు మెట్రో రైల్‌ కనెక్టివిటీ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలనీ, అదే విధంగా మెట్రో మూడో దశలో జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి శామీర్‌ పేట్‌, పారడైజ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి కండ్లకోయ లేదా మేడ్చల్‌ వరకు కవర్‌ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇంటలిజెన్స్‌ ఐజీ బి.శివ్‌ధర్‌ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం పాల్గొన్నారు.