2024 చివరి వరకు గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం కొనసాగు తుందని ఇజ్రాయిల్ రక్షణ దళాల అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపాడు. ఇజ్రాయిల్ రక్షణ దళాలలో ఐదు రిజర్వ్ బ్రిగేడ్స్ ని ఉపసంహరించాలనే నిర్ణయాన్ని యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉన్నందున ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం కోసం వ్యూహాత్మకంగా తీసుకున్నామని ఆయన వివరించాడు. అంతకు ముందు శనివారంనాడు ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు మాట్లాడుతూ యుద్ధం అనేక నెలలపాటు కొనసాగుతుందని చెప్పటం జరిగింది. గాజాలో యుద్ధం మొదలయిన తరువాత రెండు నెలల కాలంలో దాదాపు 22000మంది పాలస్తీనా వాసులు మరణించారు. మరో 56000మంది తీవ్రంగా గాయపడ్డారు. గాజాలోని 23లక్షల జనాభాలో 85% ప్రజలు కాందిశీకులుగా మారారు. కాల్పుల విరమణ కోసం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వీటో చేయటంతో సహా అమెరికా ఇజ్రాయిల్ కు పూర్తి స్థాయిలో మద్దతునిస్తోంది. గాజాను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయిల్ ప్రయత్నిస్తుండగా ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. పాలస్తీనాలో పాలస్తీనా ప్రజల కోసం ఒక రాజ్యం ఏర్పడకుండా అక్కడ శాంతి నెలకొనటం దుస్సాధ్యమని అందరికీ తెలుసు. అటువంటి పాలస్తీనా రాజ్య నిర్మాణాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.