– ఉపాధి హామీ ఉద్యోగుల వెతలు
– గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది..
– కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆశలు
నవతెలంగాణ – వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 4000 మంది ఉద్యోగులు 17 ఏండ్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వీరందరినీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయిస్ (ఎఫ్‌టీఈ) కింద నియ మించారు. ఉపాధి హామీ అడిషనల్ ప్రొగ్రామ్ ఆఫీసర్స్ అసోసి యేషన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్, కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్‌లు కలిసి 2020లో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నియమిత కాలానికి నియమించబడిన ఉద్యోగులను క్రమబద్ధీకరించి పే స్కేల్‌వర్తింప చేయాలని పోరాటం ప్రార ంభించారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ (సెర్ప్) కింద నియమితులైన 3,972 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పే స్కేల్ అమలు చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇదే శాఖలో ఎఫ్‌టీఈ ఉద్యోగులను క్రమబద్ధీకరించకుండా తీవ్ర జాప్యం చేసింది. దాంతో ఎఫ్‌టీఈ ఉద్యోగులను క్రమబద్ధీకరించి పే స్కేల్ అమలు చేయాలని ఆనాటి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకూ వినతిపత్రాలు సమర్పించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వీరి నియామకాలకు సంబంధించిన దస్త్రం ఆర్ధిక శాఖకు పంపినా అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. వీరికి వేతనాలు సైతం మూడు నెలలకోసారి వస్తున్నాయి. కాగా, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎఫ్‌టీఈ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, పే స్కేల్ వర్తింపచేస్తామని ప్రకటించారు. దాని అమలు కోసం ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. ఉపాధి హామీ చట్టంలో అదనపు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇంజినీర్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమిత కాలానికి నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా 2006లో జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్‌ఈ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు.. ఎఫ్‌టీఈ పద్దతిలో నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్లు 400 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 2,072, మండల ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 500, కంప్యూటర్ ఆపరేటర్లు 1000 మంది, మొత్తం 3,972 మంది 17 ఏండ్లుగా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ చట్టంలో ఎఫ్‌టీఈలుగా నియమితులైన ఉద్యోగులతోపాటు మరో 4 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి నాలుగు సంఘాలుగా ఏర్పడ్డారు. ఈ నాలుగు సంఘాలు 2020లో జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్)గా ఏర్పడి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పే స్కేల్ వర్తింపచేయాలని పోరాటం ప్రారంభించారు.
ఎమ్మెల్యేల లేఖలతో..
తమ లాగే నియమితులైన ‘సెర్ప్’ ఉద్యోగులను క్రమబద్ధీకరించి మమ్మల్ని విస్మరించడం ఏమిటని ఎఫ్‌టీఈ ఉద్యోగులు ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 74 మంది ఎమ్మెల్యేల లేఖలను ఉద్యోగాల క్రమబద్ధీకరణకు మద్దతుగా సమీకరించి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ లేఖలతోపాటు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మెన్ల లేఖలను సైతం ప్రభుత్వానికి పంపారు. నాటి ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు.. వారిని త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని చెప్పినా, పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఉపాధి హామీ చట్టం ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తక్షణమే వేతనాలను పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎఫ్‌టీఈ ఉద్యోగుల ఆశలు చిగురించాయి. ఈ ప్రభుత్వ హయాంలోనైనా మమ్మల్ని క్రమబద్ధీకరిస్తుందని ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
‘సెర్ప్’ ఉద్యోగుల్లానే మమ్మల్ని క్రమబద్ధీకరించాలి : ఇనుగుర్తి వెంకట్రాంరెడ్డి, ‘జాక్’ కో చైర్మెన్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ‘సెర్ప్’ ఉద్యోగులను క్రమ బద్ధీకరించి, పే స్కేల్ ఇచ్చినట్టుగానే ఎఫ్‌టీఈ ఉద్యోగులనూ క్రమబద్ధీకరించి, పే స్కేల్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మాకు వేతనాల పెంపుతోపాటు క్రమబద్ధీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.