62కి పెరిగిన జపాన్‌ భూకంప మృతులు

62కి పెరిగిన జపాన్‌ భూకంప మృతులు–  సహాయకచర్యలకు ఆటంకంగా మారిన వాతావరణం
వజిమా, జపాన్‌ : జపాన్‌ భూకంపంలో మృతుల సంఖ్య 62కి పెరిగింది. 300మందికి పైగా గాయపడగా, వారిలో 20మంది పరిస్థితి ఆందోళనకరంగా వుందని అధికారులు తెలిపారు. కాగా, శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. మరోవైపు బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం వుందని, ఫలితంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం వుందని అధికారులు హెచ్చరించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. తాజా భూకంపానికి ఇషికవా ప్రిఫెక్చర్‌, అందులోని నోటో ద్వీపకల్పం బాగా దెబ్బతిన్నాయి. వజిమా, సుజు నగరాల్లో అనేక వందల భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 32వేల మంది నిర్వాసితులు ప్రభుత్వం కల్పించిన ఆశ్రయాల్లో తల దాచుకున్నారు. కాగా, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు ప్రధాని కిషిదా తెలిపారు. కాలంతో పోటీ పడుతూ సహాయక సిబ్బంది బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.