ఒక్కటిగా ముందుకెళ్ళాలి…

Bharatjodo Nyay Yatra– కాంగ్రెస్‌ సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గే
– రాహుల్‌ గాంధీ భారత్‌జోడో న్యాయ్‌ యాత్రకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం
– పార్టీ విజయానికి పగలూ రాత్రీ పనిచేయాలి: కాంగ్రెస్‌ సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే నాయకుల మధ్య విభేదాలు పక్కనపెట్టి, కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే హితబోధ చేశారు. ఇందుకు రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ వేదిక కావాలన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో గురువారం సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమి పొత్తులు, భారత్‌ జోడో న్యాయ యాత్రపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ‘పగలు, రాత్రి పని చేయడంతోనే లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతాం’ అన్నారు. నాయకులు తమ విభేదాలను పక్కనపెట్టి అంతర్గత సమస్యలను మీడియా ముందు వెల్లగక్కకుండా, పార్టీ విజయానికి టీమ్‌గా పని చేయాలని ఖర్గే కోరారు. ‘గత పదేండ్లలో తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేం దుకు బీజేపీ భావోద్వేగ సమస్యలను తెరపైకి తెస్తున్నది. వారు ఉద్దేశపూర్వకంగానే ప్రతి విషయంలోకీ కాంగ్రెస్‌ను లాగుతున్నారు’ అని విమర్శించారు. ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్‌పాత్రను విస్మరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తున్నది. మేం వారికి తగిన సమాధానం ఇస్తాం’ అన్నారు.
గడిచిన పదేండ్లుగా యూపీఏ, కాంగ్రెస్‌ పథకాలను మార్చేందుకు మాత్రమే కేంద్రంలోని మోడీ సర్కార్‌ పని చేస్తున్నదని విమర్శించారు. పేద ప్రజల సమస్యలపై బీజేపీ చెబుతున్న అబద్ధాలు.. చేస్తోన్న మోసాలు, అక్రమాలను ఐక్యంగా ఎదుర్కోవాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. భూ సంస్కరణల నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, విద్య, పారిశ్రామిక విప్లవం వరకు ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్‌ చేసిందన్నారు. ఆధునిక భారతదేశ పునాదుల్లో కాంగ్రెస్‌ కృషి మరవలేనిదన్నారు.
చరిత్రను మరిచిన వారు చరిత్ర సృష్టించలేరని ఘాటుగా స్పందించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, కార్మికుల దుస్థితి, పేద-ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం వంటి అంశాలపై రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత, మహిళలు, అణగారిన వర్గాలతో ఈ యాత్ర సంభాషిస్తుందని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమయాత్తం చేసేందుకు ”డొనేట్‌ ఫర్‌ దేశ్‌” క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రచారం ప్రారంభించినట్టు చెప్పారు. 28 రాష్ట్రాల నేతలతో వివరణాత్మక సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట… పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలు, ఇతర అంశాలను గుర్తించాలని సూచించామన్నారు. ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్‌ల బాధ్యతలు ఖరారయ్యాయని తెలిపారు. అలాగే మ్యానిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేసి ఎన్నికల వ్యూహాల్లో భాగస్వాములుగా చేశామన్నారు.

14 నుంచి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర
రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ నెల 14 నుంచి భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రారంభంకానుందనీ, మణిపూర్‌ నుంచి ముంబాయి వరకు 6,713 కిలో మీటర్ల మేర సాగే ఈ యాత్ర మార్చి 20న ముగుస్తుందన్నారు. మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాల మీదుగా 66 రోజుల పాటు 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగనుంది. ఇందులో 337 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఏడాది కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు 4 వేల కిలోమీటర్ల మేర భారత్‌ జోడో యాత్రను రాహుల్‌ గాంధీ చేపట్టారు. 136 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత్‌ జోడో న్యారు యాత్ర చేపడుతున్నారు. యాత్ర పేరు ముందు భారత్‌ న్యారు యాత్ర అని ఉండేది. తరువాత దానికి జోడో చేర్చారు. అలాగే ముందు 14 రాష్ట్రాల్లో యాత్రను షెడ్యూల్‌ చేశారు. ఇప్పుడు మరో రాష్ట్రాన్ని చేర్చారు. రాహుల్‌ గాంధీ చేపట్టే యాత్రలో పాల్గొనాలని ఇండియా కూటమి పార్టీలను కోరామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. చిన్న పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనాలని కోరామని తెలిపింది. భారత్‌ జోడో యాత్రలో ఆర్థిక అసమానతలు, నియంతృత్వం గురించి రాహుల్‌ గాంధీ ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు చేపట్టే యాత్రలో సామాజిక, ఆర్థిక అంశాలు గురించి లేవనెత్తుతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తెలిపారు.