– వ్యాసాల, అనువాద కథల సంపుటిలు ఆవిష్కరణ
– ముఖ్య అతిథులు హాజరైన డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ప్రొ. సూర్యా ధనంజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాటలో మనసునై వ్యాసాల సంపుటి, రేపెక్కడికెళ్తావ్ అనువాద కథల సంపుటిలను శుక్రవారం రవీంద్రభారతిలోని మినిహాల్‌లో డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ సూర్యా ధనుంజయ్ ఆవిష్కరించారు. ఆ రెండు పుస్తకాలనూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులు చింతపట్ల సుదర్శన్, కవి యాకూబ్, సీఎస్.రాంబాబు, తంగిరాల చక్రవర్తి, పుస్తక రచయితలు డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్(రేపెక్కడికెళ్తావ్), కె.ఆనందాచారి(మాటలో మనసునై), తెలంగాణ సాహితి నాయకులు మోహన్‌కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కె.ఆనందాచారి తన పుస్తకంలో సామాన్య విషయాల నుంచి అసామాన్య అంశాలను వెలికి తీశారని కొనియాడారు. ఆయన విమర్శకుడిగా, కవిగా, జర్నలిస్టుగా, మంచి వక్తగా రాణిస్తున్నారని ప్రశంసించారు. కన్నీళ్లు, నవ్వు, వాన, తదితర వస్తువులను ఎంచుకుని తన అంతరంగ తరంగాల్లో భిన్న కోణాలను స్పర్శించారని చెప్పారు. అత్యంత సంక్షిప్తంగా, సూటిగా రెండు, మూడు పేజీల్లో వ్యాసాలను కూర్చటం రచనపట్ల పట్టు, అనుభవం వల్లనే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని వివిధ భాషల్లో వచ్చిన లౌకిక సాహిత్యంలో సారూప్యత ఉందనే విషయం రూప్‌కుమార్ అనువాద కథల సంపుటిలో స్పష్టంగా కనిపించిందన్నారు. తెలుగు సాహిత్యప్రియులు కచ్చితంగా చదవాల్సిన కథల సంపుటి అన్నారు. ఓనా చిట్టి తండ్రి కథలో కుటుంబ బాంధవ్యాలను చాలా చక్కగా వర్ణించారని కొనియాడారు. నరేటివ్ టెక్నిక్స్‌ను పట్టుకోవడంలో రచయిత కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రొఫెసర్ సూర్యా ధనంజరు మాట్లాడుతూ..రెండు పుస్తకాల శీర్షికలు బాగున్నాయన్నారు. పద్మశ్రీ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహితలైన రచయితకు చెందిన 15 భాషలకు చెందిన కథలను సెలెక్ట్ చేసుకుని కథలను వర్ణించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆలోచనను రేకెత్తించేలా, గుండెను పించేసేలా కథలున్నాయని ప్రశంసించారు. అస్థిత్వమూలాల కథ బాగుందనీ, అది చదివే సమయంలో తన తల్లి కండ్ల ముందు కదలాడిందని చెప్పారు. చింతపట్ల సుదర్శన్ మాట్లాడుతూ..అనువాదం క్లిష్టమైన ప్రక్రియ అన్నారు. కథల సంపుటికి భారతీయ సమాజాన్ని ప్రతిబింబించేలా, ప్రతి కథనూ చదివిపించేలా ఆనందాచారి అద్భుతంగా ముందుమాట రాశారని ప్రశంసించారు.