మెట్టప్రాంత వరప్రదాయని తోటపల్లి రిజర్వాయర్‌

మండల సమగ్రాభివృద్ధిలో మంత్రి
హరీశ్‌రావు ప్రత్యేక పాత్ర
సుమారు రూ.150 కోట్లతో మండలంలో
పలు అభివృద్ధి పనులు
మెట్ట ప్రాంతమైన బెజ్జంకి మండలంలో ఒకప్పుడు ప్రజలు తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి అంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాలు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసి దాహార్తి తీర్చిన రోజులున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మండలం చుట్టుపక్కల మిడ్‌ మానేర్‌, అన్నపూర్ణ, తోటపల్లి ఆన్‌ జలశయాలు నిర్మాణం పూర్తవ్వడంతో మెట్టప్రాంతమైన బెజ్జంకి మండలంలో జలకళ సంతరించుకుంది. సాగు, తాగు నీరు అందుబాటులోకి వచ్చాయి. మండల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషి చేస్తున్నారు.
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని తోటపల్లి గ్రామం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు జిల్లాల పునర్విభజన అనంతరం సిద్దిపేట జిల్లాలో తన ప్రత్యేకతను చాటుతోంది. తోటపల్లి గ్రామంలో జన్మించిన బోయినిపల్లి వెంకట రామారావు(బోవెరా) స్వాతంత్య్ర సమరయోధుడు తనదైన శైలిలో పోరాటాలు చేసి కరీంనగర్‌ గాంధీగా పేరుప్రఖ్యాతలు గడించారు. రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కరీంనగర్‌ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రావు రాష్ట్ర రాజకీయ రంగంలో తమదైన శైలిలో వ్యవహరిస్తూ చేరగని ముద్ర వేస్తున్నారు. పుట్టిన ఊరుకు తమ వంతుగా తోడ్పాటును అందించాలనే ధృఢ సంకల్పతో తోటపల్లి గ్రామాభివృద్ధిలో భాగాస్వాములయ్యారు. తమ వంతుగా చేయూతను అందించి తోటపల్లి గ్రామాన్ని నేడు అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడిపించారు. మంత్రి హారీశ్‌ రావు తోటపల్లి గ్రామాభివృద్ధికి చేసిన ప్రత్యేక కృషి గ్రామంలో బావితరాలకు సత్పలితాలిస్తాయని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెట్టప్రాంత వరప్రదాయని’తోటపల్లి రిజార్వయర్‌’
పురాతన కాలంలో నిర్మించిన గ్రామంలోని పెద్ద చెరువును సుమారు రూ.83 కోట్లతో ఆన్‌లైన్‌ రిజార్వయర్‌గా పునరుద్ధరించడంతో మండల ప్రజలకు వరప్రదాయనిగా మారింది. మిడ్‌ మానేర్‌ వరదకాల్వ ద్వారా రిజార్వయర్‌లో ఎల్లవేళలా 0.32 టీఎంసీల నీరు నిల్వ ఉండే సామర్థ్యంతో రూపుదిద్దారు. దీంతో మండలంలో బావుల్లో, బోరుబావుల్లో అడుగంటిన భూగర్భ జలాలు వృద్ది చెందుతున్నాయి. బెజ్జంకి, కోహెడ, చిగురుమామిడి మండలాల రైతులకు కాల్వల ద్వార సాగు నీరు అందిస్తోంది.
మండలాభివృద్ధిలో మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక పాత్ర
నిరుపేదల సొం తింటి కల నేరవేర్చాలనే ప్రభుత్వ ధృఢ సంకల్పాన్ని సుమారు 1.56 కోట్ల ప్రభుత్వ నిధులతో తోటపల్లి గ్రామంలో సుమారు 30 డబుల్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు మంత్రి హరీశ్‌ రావు పంపిణీ చేశారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలీంచి నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.1.51 కోట్ల నిధులు మంజారీ చేశారు. గ్రామంలోని ప్రధాన రోడ్డును సుమారు రూ.5 కోట్ల నిధులతో 2.5 కి.మీ వరకు డబుల్‌ రోడ్డుగా రూపుదిద్దారు. సుమారు రూ.4 కోట్లతో వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ నిర్మాణం చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.గ్రామంలో అంబేడ్కర్‌ సామూహిక భవన నిర్మాణానికి సుమారు రూ.25 లక్షలు ఇటీవల మంజూరీ చేశారు. తన స్వంత ఖర్చులతో రామాలయం, చెన్న కేశవ ఆలయాల నిర్మించి గ్రామస్తులకు అధ్యాత్మిక శోభను అందించారు. తన స్వంత 0.05 ఎకరాల భూమిని విరాళంగా అందజేసి సుమారు రూ.15 లక్షల ప్రభుత్వ నిధులతో గ్రంథాలయం, మహిళ సంఘ భవన నిర్మాణాలకు చేయూతనందించారు. మండలంలోని అయా గ్రామాల్లోని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ విజ్ఞప్తి మేరకు రూ.20 కోట్ల నిధులు మంజారీ చేశారు.చల్మేడ ఫీడ్స్‌ సౌజన్యంతో ప్రభుత్వోన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సహకారమందించారు.
అందరి భాగాస్వామ్యంతో సమగ్రాభివృద్ధి
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తోటపల్లి గ్రామాభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సహకారంతో మంత్రి తన్నీరు హరీశ్‌ రావు గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ నిధులతో పాటు స్వంత ఖర్చులతో అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రావు తమవంతుగా గ్రామా భివృద్ధికి శాయశక్తుల కృషి చేశారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటునం దించిన ప్రముఖులు, సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు.
– బోయినిపల్లి నర్సింగరావు, సర్పంచ్‌ తోటపల్లి