హిందూత్వ శక్తులకు లొంగిపోతున్నదా?

 To Hindutva forces Surrender?– న్యాయ వ్యవస్థ తీరుపై రాజ్యాంగ నిపుణుల సందేహాలు
– అయోధ్య, ఆర్టికల్‌ 370 తీర్పులను ప్రస్తావిస్తూ విమర్శిస్తున్న న్యాయ కోవిదులు
ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఇటీవల పీటీఐ వార్తా  సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ అయోధ్య కేసులో, ఆర్టికల్‌ 370 రద్దు కేసులో ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చామని, అందులో హేతుబద్ధత ఉన్నదని తెలిపారు. అయితే ఈ తీర్పులు భారత న్యాయ వ్యవస్థ స్వభావానికి, దాని దిశకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని విమర్శకులు తెలిపారు. వాస్తవానికి ఈ రెండు తీర్పులను పరిశీలిస్తే పాలకుల ఆలోచనలకు అనుగుణంగానే న్యాయవ్యవస్థలో మెజారిటీ వర్గం వ్యవహరిస్తున్నదని, ఇది ప్రమాదకరమైన సంకేతమని వారు హెచ్చరించారు.

న్యూఢిల్లీ : మోడీ పాలనలో హిందూత్వ ఆధిపత్య వాదం తన వక్రీకరణలు, సొంత భాష్యాల ద్వారా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ సుప్రీంకో ర్టు ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పు, మోడీ ప్రభుత్వ చర్యను సమర్ధించేలా ఇచ్చిన వివరణ పట్ల లౌకిక, ప్రజాస్వామిక, సమాఖ్య రిపబ్లిక్‌గా కొనసాగుతున్న భారత దేశ భవిష్యత్తుపై పలువురు రాజ్యాంగ నిపుణులు, పాత్రికేయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే రకమైన పస లేని తర్కాన్ని ప్రదర్శించిందని వారు గుర్తు చేశారు. ఈ రెండు కేసులూ ప్రస్తుత ప్రభుత్వ సైద్ధాంతిక ప్రాజెక్ట్‌ అయిన ‘హిందూ రాష్ట్ర’ దృష్టిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి. ఈ రెండింటిలోనూ హిందూత్వ శక్తులకు అనుకూలంగా తుది తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుల ద్వారా న్యాయస్థానం అత్యంత అసాధారణమైన అంశాలను సాధారణమైనవిగా మార్చేసింది. ఒకరకంగా ‘హిందూ రాష్ట్ర’ భావనకు చట్టబద్ధత కల్పించింది. రాజ్యాంగ విరుద్ధమైన వాటిని రాజ్యాంగ బద్ధం చేసింది.
ఆర్టికల్‌ 370 రద్దుపై…
ఆర్టికల్‌ 370 జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని, పరిమిత సార్వభౌమాధికారాన్ని కల్పించింది. అయితే స్వాతంత్య్రానంతరం కేంద్రంలో తొలుత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన ఆ హామీని విస్మరించా యి. 2019లో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ రాష్ట్ర అజెండాతో రాష్ట్రపతి ఉత్తర్వులతో ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. మోడీ ప్రభుత్వ చర్యలో చట్టబద్ధత, హేతుబద్ధత లేకపోవడం, ఓ పద్ధతి ప్రకారం వ్యవహరించకపోవ డం, రాజ్యాంగ అనైతికతకు పాల్పడడం వంటి ప్రశ్నలు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చాయి.
‘370’కి వక్రభాష్యం
ఆర్టికల్‌ 370ని రాజ్యాంగపరమైన అడ్డంకిగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు భావించాయి. ఈ అధికరణకు అవి వక్రభాష్యం చెప్పాయి. ఈ వాదనను న్యాయస్థానం సమర్ధించింది. భారతదేశంలో విలీనమైన తర్వాత జమ్మూకాశ్మీర్‌కు ఎలాంటి సార్వభౌమాధికారం ఉండదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ తన తీర్పులో స్పష్టం చేశారు. అయితే ఈ వివరణ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉంది. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన తీర్పులో అత్యంత సందేహాస్పదమైనది 370 (3) అర్థాన్ని అశాస్త్రీయంగా చెప్పడం. ఆర్టికల్‌ రద్దుకు ఆమోదం తెలపాలంటే దానికి ముందుగా కాశ్మీర్‌ శాసనసభ దానిని విధిగా సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని న్యాయమూర్తులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ‘రాజ్యాంగ సభ’ స్థానంలో ‘శాసనసభ’ అనే పదాన్ని వాడేందుకు వీలుగా ఆర్టికల్‌ 370 (3)ని సవరించడానికి ఆర్టికల్‌ 368ని ఉపయోగించుకున్న తీరును జస్టిస్‌ చంద్రచూడ్‌ తప్పుపట్టారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమైనదని పేర్కొంటూ దానిని తోసిపు చ్చారు. అయితే ఈ తప్పుడు రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే ఆర్టికల్‌ 370ని రద్దు చేశారన్న విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసు కోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించిందని న్యాయ నిపుణులు తెలిపారు.
న్యాయ కోవిదుల విస్మయం
ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అనేక లొసుగులు ఉన్నాయని జస్టిస్‌ (రిటైర్డ్‌) మదన్‌ లోకర్‌, జస్టిస్‌ (రిటైర్డ్‌) రోహింటన్‌, ఫాలీ నారిమన్‌ వంటి రాజ్యాంగ న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌ స్థాయిని తగ్గించడం రాజ్యాంగబద్ధం అవుతుందా కాదా అనే అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం విముఖత చూపడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంలో అధికారులు మౌఖికంగా ఇచ్చిన హామీపై సంతృప్తి వ్యక్తం చేయడంలో ధర్మాసనం తొందరపాటు కనబరిచిందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకూ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయడానికి న్యాయస్థానం అనుమతించడంపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆధారాలపై విశ్వాసాల విజయం
ఆర్టికల్‌ 370పై ఇచ్చిన తీర్పుతో పోలిస్తే అయోధ్య వివాదంలో వెలువరించిన తీర్పు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయోధ్య తీర్పు సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం ఏమని ప్రకటించిందంటే…మసీదు ప్రాంతంలో మందిరం ఉన్నదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. బాబ్రీ మసీదు విధ్వంసం తీవ్రమైన నేరం… అనే వ్యాఖ్యలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు చివరికి ఈ వివాదానికి ఏమని ముగింపు పలికింది? తాను చెప్పిన కారణాలకు విరుద్ధంగా తానే తీర్పు ఇచ్చింది. మైనారిటీ వర్గాలు అందించిన వాస్తవాలు, ఆధారాలపై మెజారిటీ వర్గాల విశ్వాసాలు, నమ్మకాలే విజయం సాధించాయి. కోర్టు చేసిన వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి…’విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. అవి ఆత్మిక సాంత్వన కలిగిస్తాయి. నమ్మకం సమర్ధనీయమా అనే విషయం న్యాయ విచారణకు అతీతమైనది. ఇది సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకునే కేసు కాదు. సాక్షులు తమ నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా సాక్ష్యం చెబితే వాటిలో వాస్తవాలను అనుమానించాల్సిన అవసరం లేదు. విశ్వాసాల ఆధారంగా చెప్పిన విషయాలను కోర్టులు ప్రశ్నించలేవు. రాత ప్రతుల ఆధారంగా ఇచ్చే వివరణలు అనుమానాలకు తావిస్తాయి. న్యాయస్థానాలు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది’.
పరస్పర విరుద్ధ తీర్పులు
దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ముస్లిం పిటిషనర్లు పుంఖానుపుంఖాలుగా సమర్పించిన రుజువులు, ఆధారాల కంటే హిందువుల విశ్వాసాల ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది కదా!. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. అయోధ్య కేసులో హిందువుల విశ్వాసాలను న్యాయస్థానం గౌరవించింది. మరి అదే హిజాబ్‌ కేసులో ముస్లింల నమ్మకాలను తోసిపుచ్చింది.
అయోధ్య తీర్పు సందర్భంగా 1991వ సంవత్సరం నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. ఈ చట్టం భారత లౌకిక నిర్మాణాన్ని పరిరక్షిస్తుందని, చారిత్రక ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడాన్ని నిషేధిస్తోందని కొనియాడింది. అయితే జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత అదే చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను అనుమతించారు. జ్ఞానవాపి, మధుర మసీదు కేసుల విషయంలో ఆయన నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆ చట్టం స్ఫూర్తిని నీరుకార్చింది. ఈ విషయాల్నింటినీ పరిశీలిస్తే హిందూత్వ అజెండాతో ఏకీభవిస్తున్న సుప్రీంకోర్టు తీర్పులు సారూప్యతల దృష్ట్యా అనుకోకుండా ఇచ్చినవో లేక యాధృచ్ఛికంగా ఇచ్చినవో కావని బెంగళూరుకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ శివసుందర్‌ అభిప్రాయపడ్డారు.