పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌

Mega Master Plan for Industrial Development– మూడు క్లస్టర్లుగా తెలంగాణ
– ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తాం
–  మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం
–  కొత్తగా ఫార్మా విలేజ్‌లు
–  అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం
రాష్ట్రవ్యాప్తంగా 2050 నాటికి పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా మెగా మాస్టర్‌ పాలసీని రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామనీ, అంతకంతకు విలువ కూడా పెరుగుతుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్‌ తరహాలోనే అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను రేవంత్‌ వ్యక్తపరిచారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమని అన్నారు. నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి ఫలాలు, పెట్టుబడులతోనే గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల సౌభాగ్యం, సంక్షేమం కూడా ముడిపడి ఉంటుందని వివరించారు. పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల అర్బన్‌ క్లస్టర్‌, ఓఆర్‌ఆర్‌ తర్వాత రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్‌ క్లస్టర్‌గా, రీజనల్‌ రింగ్‌ రోడ్డు తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాలను అందిస్తామని వివరించారు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మాసిటీతో పాటు ఫార్మా విలేజీలను కూడా అభివద్ధి చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్‌పై 14 రేడియల్‌ రోడ్లు ఉన్నాయనీ, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని తెలిపారు. వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్యం లేకుండా చూస్తామన్నారు. పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని అభివృద్ధి చేసే ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. ఇదే విధంగా అన్ని రంగాలకు ప్రోత్సాహకాలను అందిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికలు వేరు… రాజకీయాలు వేరు…
ఎన్నికలు, రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధిని తమ లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదనే అపోహాలు పెట్టుకోవద్దని అన్నారు. ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. 24 గంటల పాటు తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటాననీ, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలంటూ పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారు లను ఆహ్వానించారు. తమతోగానీ, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులతోగానీ మాట్లాడకుండానే తొందరపడి ఒక అభిప్రాయానికో, నిర్ణయానికో రావద్దని వారిని కోరారు. యువతీ యువకులకు నైపుణ్యాలను నేర్పించేందుకు ఆయా యూనివర్సిటీలను నెలకొల్పుతామని రేవంత్‌ తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయనీ, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ ప్రతినిధులు సి.శేఖర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ మోహన్‌ రెడ్డి, సతీష్‌ రెడ్డి, సుచిత్రా కె.ఎల్లా, శ్రీమతి వనిత దాట్ల, రాజు, సంజరు సింగ్‌, ప్రదీప్‌ ధోబాలే, శక్తి సాగర్‌, వె.ౖ హరీష్‌ చంద్ర ప్రసాద్‌, గౌతమ్‌ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్‌ రెడ్డి రాచమల్లు, రామ్‌, చక్రవర్తి, షైక్‌ షామి ఉద్దీన్‌, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధిపై….
మూసీనది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్‌ రోడ్‌ టూ రింగ్‌ రోడ్‌ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం తెలిపారు. అందువల్ల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్‌ డిజైన్లలతో అమ్యూజ్‌ మెంట్‌ పార్కులు, వాటర్‌ ఫాల్స్‌, చిల్డ్రన్‌ వాటర్‌ స్పోర్ట్స్‌, స్ట్రీట్‌ వెండర్స్‌, బిజినెస్‌ ఎరియా, షాపింగ్‌ మాల్స్‌ లను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్‌, గొల్కొండ, సెవెన్‌ టూంబ్స్‌, తారామతి బారాదరి వంటి వాటిని అనుసంధా నిస్తూ ఒక టూరిజం సర్క్యూట్‌ను రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పీపీపీ మోడల్‌లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నా మన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేం దుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులను ఆదేశించారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో చెక్‌ డ్యాములను నిర్మించి వాటర్‌ ఫౌంటెన్స్‌, వాటర్‌ ఫాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్‌ స్టార్‌ హౌటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని అన్నారు.
ఆమెట్రో రూట్‌తో ఉపయోగం
సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్‌ రూట్‌ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి – ఎయిర్‌ పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారనీ, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదని తెలిపారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అత్యధిక మంది ధనికులు వుండటం వల్ల వారు ఎక్కువగా సొంత వాహనాలు వాడుతున్నారని తెలిపారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్‌ నామ – ఏయిర్‌పోర్టు రూట్‌, ఎల్బీ నగర్‌ నుంచి ఎయిర్‌ పోర్టు రూట్‌ను ప్రజలు ఎక్కువగా వినియోగిం చుకునేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్‌ దేశాలకు అధికంగా వెళుతుంటారని చెప్పారు. విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్‌ పోర్టుకు వెళ్లి సెండాఫ్‌ ఇస్తుంటారని వివరించారు. అందుకే ఈ రూట్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో వెల్‌ స్పాన్‌ గ్రూప్‌ పెట్టుబడులు
రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పాన్‌ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో వెల్‌స్పాన్‌ గ్రూప్‌ చైర్మెన్‌ బి.కె.గోయెంకా, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తున్నదని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వెల్లడించారు. గోయెంకా మాట్లాడుతూ తమ కంపెనీ భవిష్యత్తులో చందన్‌ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టబోతోందని వివరించారు. టైర్‌ 2, 3లలోని ఐటీలను అభివృద్ధి చేసి ప్రమోట్‌ చేసేందుకు, వికారాబాద్‌, అదిలాబాద్‌ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.