– బీజేపీ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి: సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు వల్ల దేశంలో ఆకలిచావులు, నిరుద్యోగ సమస్య, దారిద్య్రం, ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోవడాన్నీ, కార్పొరేట్, కమ్యూనల్ కలగలిసి ముందుకెళ్తూ కార్మిక, కర్షక ఐక్యతను దెబ్బతీయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత ప్రకటించారు. మోడీ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థం చేయించేందుకు జిల్లాల్లో, మండలాల్లో ప్రదర్శనలు, సభలు, సమవేశాలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీఐటీయూ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో కార్మిక వర్గ పరిస్థితిలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు. దాని ఫలితంగా పోరాటాలు ఉధృతం అవుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్మా జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ పోరాటాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఇలా చేయడం సరిగాదన్నారు. బీజేపీ మతోన్మాద ప్రమాదాన్ని నివారించి మోడీని గద్దె దించడానికి కార్మిక వర్గం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.