– యువ ఓటర్ల ఆకర్షణకు ప్రత్యేక కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు ప్రత్యేకంగా కమిటీలనూ నియమిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలను ప్రారంభించింది. కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన వివిధ కమిటీలతో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది.యూత్ ఓట్లను ఆకర్షించేందుకు నవ యువ ఓటర్ల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధానంగా బూత్‌ల వారీగా యువ ఓటర్లు ఎంత మంది ఉన్నారు? వారిలో తొలిసారి ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయబోతున్నారు? వారికి ఎలా చేరువ కావాలి? అనే అంశాలపై ఈ కమిటీ పనిచేయనున్నది. లోక్‌సభ ఎన్నికల్లో రామమందిర నిర్మాణం ద్వారా లబ్ది పొందటం, హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లటం కోసం రామ మందిర దర్శన కమిటీని కూడా నియమించింది. కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగానూ వికసిత్ భారత్ కమిటీని కూడా వేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకూ బీజేపీకి దూరంగా ఉన్న ఓటర్లను ఆకర్షించేందుకుగానూ గ్రామాల్లో, బస్తీల్లో పనిచేసేందుకు కూడా రెండు కమిటీలను వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్‌తో పనిచేయాలని సునీల్ బన్సల్ దిశానిర్దేశనం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశాల్లో బీజేపీ పార్లమెంట్‌బోర్డు సభ్యులు, ఎంపీ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజరు, తెలంగాణ రాష్ట్ర సహ ఇన్‌చార్జి, బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, ఈటలరాజేందర్, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.