– ‘రెరా’ చైర్మెన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మధ్యవర్తిత్వం ద్వారా బిల్డర్లు, కొనుగోలుదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎన్ సత్యనారయణ అన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) లా కళాశాల సమావేశ మందిరంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులకు రెరా చట్టంపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని చెప్పారు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ యాజమాన్యం ఎలాంటి వ్యాపార ప్రకటనలు, కార్యక్రమాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి సేకరించిన నిధుల్లో 70 శాతం కచ్చితంగా అదే ప్రాజెక్టుకు వినియో గించాలనీ, 2/3 వంతు కొనుగోలుదారుల ఆమోదం లేనిదే ఎలాంటి మార్పులు చేయరాదని వివరించారు. బిల్డర్లు విధిగా వార్షిక, త్రైమాసిక ఆడిట్ నివేదికలు సమర్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ లా కళాశాలలో పిన్సిపల్, డీన్, హెచ్‌ఓడీగా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన ప్రొఫెసర్ కృష్ణమాచార్యులు, రిటైర్డు ఐపీఎస్ అధికారి జనార్థన్, లా కళాశాల ప్రిన్సిపల్ రాధిక, నిర్వాహకులు నాగార్జున, సురేష్, న్యాయవాది నంద్యాల దయాకర్ రెడ్డి, మల్లారెడ్డి, జీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు కేక్ కట్ చేసి పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు ఉద్యోగ విరమణ పొందిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.