అనుమానాస్పదంగా గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

అనుమానాస్పదంగా గురుకుల విద్యార్థిని ఆత్మహత్య– జహీరాబాద్‌ పట్టణంలోని రంజోల్‌లో ఘటన
నవతెలంగాణ-జహీరాబాద్‌
ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని రంజోల్‌ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్‌ గురుకులంలో జరిగింది. జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ ప్రసాద్‌రావు, కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణవేణి తెలిపిన వివరాల ప్రకారం.. తూముకుంట గ్రామానికి చెందిన స్వప్న(16).. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్‌ గురుకుల కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. అయితే ఆదివారం మధ్యాహ్నం భోజనానంతరం స్టడీ అవర్స్‌లో విద్యార్థులంతా చదువుకుంటుండగా.. స్వప్న తన ఇంగ్లీష్‌ పుస్తకాన్ని తీసుకువస్తానని హాస్టల్‌ గదికి వెళ్ళింది. తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థినులు.. గదికి వెళ్లి పరిశీలించారు. గది లోపల నుంచి గడి పెట్టుకుని.. ఫ్యాన్‌కు ఉరేసుకుని స్వప్న కనిపించింది. దాంతో వెంటనే కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణవేణితో పాటు అధ్యాపకులకు సమాచారం అందించారు. వారు ఆమెను కిందికి దింపి స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే స్వప్న మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కళాశాల ప్రిన్సిపల్‌ సమాచారం అందించారు. దాంతో ఆమె తల్లిదండ్రులతోపాటు తూముకుంట గ్రామస్తులు, పలు పార్టీల, సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కమ్యూనిటీ వైద్యశాలకు చేరుకున్నారు. కాగా డీఎస్పీ వి.రఘు ఆస్పత్రికి చేరుకోగా.. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అయన్ను అడ్డుకొని వెంటనే విచారణ చేపట్టాలని, అప్పటివరకు పోస్టుమార్టం నిర్వహించేది లేదని అడ్డుకున్నారు. దాంతో డీఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ, వివిధ శాఖల అధికారుల బృందం కళాశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.
కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణవేణి మాట్లాడుతూ.. కళాశాలలోనే స్వప్న చాలా చురుకైన విద్యార్థిని అని చెప్పారు. చదువులో కూడా బాగా రాణిస్తుందని, ఇలా ఎందుకు చేసుకుందో అర్థం కావడం లేదన్నారు. అనంతరం స్వప్న తండ్రి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తమ కూతురు చావుకు కారణాలు తెలియాలని పట్టుబట్టారు. చిన్నపాటి జ్వరం వచ్చినా తక్షణమే విద్యార్థులను తీసుకెళ్లాలని కళాశాల నుంచి ఫోన్‌ చేసేవారన్నారు. అలాంటిది తన కూతురు ఆత్మహత్య చేసుకుంటే కనీసం చెప్పకుండా.. ఎలా కిందికి దించుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని హాస్టల్‌కు తరలించి, విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.