– 2022-23లో 70 శాతానికి పైగా విరాళాలు
– రూ.259 కోట్లకు పైగా సమకూరిన వైనం
– బీఆర్‌ఎస్‌కు 24 శాతానికి పైగానే
– ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : బీజేపీకి ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి నిధులు వరదలా పారాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టులు అందించిన మొత్తం విరాళాలలో బీజేపీకి 70.6 శాతానికి పైగా లభించింది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. కార్పొరేట్ గ్రూపులు, వ్యక్తుల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించటానికి కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ-2 ప్రభుత్వం 2013లో ఎలక్టోరల్ ట్రస్టుల పథకాన్ని ప్రవేశపెట్టింది. అనామకంగా ఉన్న ఎలక్టోరల్ బాండ్‌ల లాగా కాకుండా, ఎలక్టోరల్ ట్రస్టులు తమ విరాళాల నివేదికలను ప్రతి సంవత్సరం ఎన్నికల కమిషన్‌కు ప్రకటించాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ)లో నమోదైన 18 ఎలక్టోరల్ ట్రస్ట్‌లలో 13.. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి తమ కాంట్రిబ్యూషన్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. వీటిలో ఐదు ట్రస్ట్‌లు మాత్రమే ఆ కాలంలో విరాళాలు అందుకున్నట్టు ప్రకటించాయి. ఇందులో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అసోసియేషన్, పారిబర్టన్ ఎలక్టోరల్ ట్రస్ట్, ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్, ఎయింజిగార్టిగ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌లు ఉన్నాయి. ఎలక్టోరల్ ట్రస్ట్‌లు ఆర్థిక సంవత్సరంలో అవి స్వీకరించే మొత్తం విరాళాలలో కనీసం 95 శాతం పంపిణీ చేయాలి.
2022-23లో ఈ ఐదు ఎలక్టోరల్ ట్రస్ట్‌లు రూ. 366.495 కోట్లను విరాళంగా అందుకున్నట్టు ఏడీఆర్, ఎన్నికల నిఘా సంస్థ విశ్లేషణలో తేలింది. ఆ తర్వాత ఐదు ట్రస్టులు వివిధ రాజకీయ పార్టీలకు రూ.366.48 కోట్లు విరాళంగా అందించాయి.
2022-2023లో ఐదు ఎలక్టోరల్ ట్రస్టులు విరాళంగా ఇచ్చిన మొత్తంలో బీజేపీకి రూ.259.08 కోట్లు రావటం గమనార్హం. ఒక్క ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.256.25 కోట్లు విరాళంగా ఇచ్చింది. సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అసోసియేషన్ కాషాయ పార్టీకి రూ.1.5 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.50 లక్షలు విరాళంగా అందించింది.
‘మెఘా ఇంజినీరింగ్’ నుంచి ‘ప్రుడెంట్’కు రూ. 87 కోట్లు
టాప్ 10 కార్పొరేట్ దాతలు ఎలక్టోరల్ ట్రస్టులకు రూ.332.26 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది 2022-23లో ట్రస్టులు అందుకున్న మొత్తం విరాళాలలో 90.66 శాతం కావటం గమనార్హం. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్.. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు అత్యధికంగా రూ. 87 కోట్ల విరాళాన్ని అందించగా, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూ. 50.25 కోట్లు విరాళంగా అందించింది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్, అభినంద్ వెంచర్స్ రూ. 50 కోట్ల చొప్పున విరాళంగా ఇచ్చాయి.
ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. దీంతో, కార్పొరేటు గ్రూపులు,వ్యక్తుల ద్వారా ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి బీజేపీకి పరోక్షంగా పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. కార్పొరేటు సంస్థలు బీజేపీ నుంచి ‘ప్రతిఫలం’ ఆశించే ఇంత పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్‌ఎస్‌కు రూ.90 కోట్లు
తెలంగాణలో ఇటీవలే అధికారాన్ని కోల్పోయి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌కు రూ.90 కోట్లు అంటే మొత్తం విరాళాల్లో 24.56 శాతం ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రావటం గమనార్హం. ఏపీలోని అధికార వైసీపీ, ఢిల్లీలోని అధికార ఆప్, కాంగ్రెస్‌లు కలిసి మొత్తం
రూ.17.4 కోట్లు
అందుకున్నాయి.