ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ను ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు నిర్వహించాలని సంబంధిత కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లోని బుక్‌ ఫెయిర్‌ కార్యాలయంలో అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుక్‌ ఫెయిర్‌ నూతన కార్యదర్శిగా ఆర్‌.వాసు బాధ్యతలు చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్‌ స్టేడియంలోనే బుక్‌ ఫెయిర్‌ ఉంటుందని తెలిపారు. పుస్తక ప్రియులు, పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి పి రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్‌ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్‌, సహయ కార్యదర్శి శోభన్‌ బాబు, జనార్థన్‌ గుప్తా, కవి యాకూబ్‌, శ్రీకాంత్‌, బాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఇది 36వ హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ కావడం గమనార్హం.