భారత్‌కు ఎర్ర సముద్రం సెగ

Red Sea to India– ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్లు తగ్గొచ్చు
ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్ల వరకు క్ష్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో ఓడలకు వచ్చే బెదిరింపులతో షిప్పింగ్‌ రేట్ల పెరుగుదలకు దారితీయడంతో పాటుగా ఎగుమతిదారులు ఎగుమతులను నిలిపివేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న రీసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ ప్రాథమికంగా అంచనా వేసింది.
న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం మొత్తం 451 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది 6.7 శాతం తగ్గుదల చోటు చేసుకోవచ్చని అంచనా వేసింది. ”ఎర్ర సముద్రంలో సంక్షోభం భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మరింత పతనానికి దారితీయవచ్చు” అని రీసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ సచిన్‌ చతుర్వేది పేర్కొన్నారు. కాగా.. ఎర్ర సముద్ర సంక్షోభం దేశ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపవచ్చనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రపంచంలోని అతిపెద్ద షిప్‌ బ్రోకర్‌ అయిన క్లార్క్‌సన్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ప్రకారం.. సూయజ్‌ కెనాల్‌ గుండా ప్రయాణిస్తున్న నౌకల సంఖ్య డిసెంబర్‌ మొదటి సగం సగటుతో పోలిస్తే జనవరి 3వ తేది నాటి వారంలో 44 శాతం తగ్గింది. యెమెన్‌కు చెందిన ఇరాన్‌ మద్దతుగల హౌతీ మిలిటెంట్లు ఇటీవలి ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తున్న నౌకలను క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంటున్నారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఎర్ర సముద్రం ద్వారా ఐరోపా, ఈస్ట్‌ కోస్ట్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికన్‌ దేశాలకు భారత్‌ సరుకు రవాణ చేస్తోంది. ఎర్ర సముద్రం గుండా రవాణా చేసే దేశ ఎగుమతుల్లో నిలుపుదల అయ్యాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజరు సహారు పేర్కొన్నారు. ఆసియా నుండి ఉత్తర ఐరోపాకు 40 అడుగుల కంటైనర్‌లో వస్తువులను రవాణా చేసే వ్యయాలు 173 శాతం పెరిగాయన్నారు. ఆసియా నుండి ఉత్తర అమెరికా తూర్పు తీరం వరకు ధరలు 40 అడుగుల కంటైనర్‌కు 55 శాతం పెరిగి 3,900 డాలర్లకు చేరుకున్నాయన్నారు. భారత్‌ సాధారణంగా ఎర్ర సముద్ర మార్గాన్ని ఉపయోగించి పెట్రోలియం ఉత్పత్తులు, తృణధాన్యాలు, రసాయనాలతో సహా అనేక రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ సమయంలో ఎగుమతులు 6.5 శాతం పతనమయ్యాయి. అధిక గ్లోబల్‌ రవాణ ఛార్జీలు, బీమా రేట్లు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.