
– మాతృదేశ అభిమానాన్ని చాటుతున్న ప్రవాస భారతీయులు
నవతెలంగాణ -పెద్దవూర
భారతదేశ అభివృద్ధిలో పవాస భారతీయుల పాత్ర ఎనలేనిదని, వారిని గౌరవించడం మన సంప్రదాయమని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామనీ బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రవాస భారతీయులు మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వున్నారు. మాతృ గడ్డమీద మమకారం చూపిస్తున్నారని అన్నారు. తాము డాలర్లుగా సంపాదించిన వాటిని కోట్లలో మార్చి మన దేశంలో ఆయా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజనీ అన్నారు. జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము ప్రతీ ఏటా జరుపుకోవటం ఆనవాయితి అని అన్నారు. 2003 లో స్థాపించబడి, భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య భారత పరిశ్రమల సమాఖ్య, నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ఆమోదం పొందింది. అగ్ర రాజ్యం అమెరికా కి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వివిధ దేశాల్లో మన వారు పెద్ద వ్యాపార కంపెనీలు పెట్టి , లక్షలాది మందికి ఉపాధి కల్పన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో కూడా రాణిస్తూ సుపరి పాలన అందిస్తున్నారనీ, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మన పండుగలను పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు జరుపుకుంటూ మన దేశ కీర్తిని ఇనుమడింపచేస్తున్నారని కొనియాడారు. అందరం ఒక్కటే అనే సమైక్య భావాన్ని చాటుతూ, దేశ ఔన్నత్యాన్ని తెలిపారు.